అంతా ‘కమర్షియల్’

22 Mar, 2016 04:34 IST|Sakshi
అంతా ‘కమర్షియల్’

నో వేబిల్.. జేబులు ఫుల్  నిత్యం సరుకు సరఫరా
పన్నులు మాత్రం ఎగనామం ప్రభుత్వ ఆదాయానికి గండి
మామూళ్ల మత్తులో వాణిజ్యశాఖ అధికారులు
కావలిలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి పట్టుబడ్డ ఏసీటీఓ

 
 నెల్లూరు వాణిజ్యపన్నుల శాఖలో అవినీతికి అంతులేకుండా పోతోంది. లెసైన్స్ దగ్గర నుంచి పన్ను చెల్లింపు వరకు కొందరు అధికారులు పనికోరేటు నిర్ణయించి వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. జాక్‌పాట్ లారీలు వీరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికారుల కక్కుర్తితో ప్రభుత్వ ఖజానాకు  భారీగా గండిపడుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం సరకులు.. విలువైన వస్తువులను లారీల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చేరవేస్తుంటారు. అయితే ఏ ఒక్క లారీకి వే బిల్లు ఉండదు. వే బిల్లుకు చెల్లించే మొత్తాన్ని కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల జేబుల్లోకి చేరుతోంది. లారీల యజమానులు కూడా కొందరు అధికారులకు నెలనెలా మామూళ్లు సమర్పించుకుంటున్నారు. వ్యాపారులు క్రయ, విక్రయాలకు సంబంధించి వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తుంటారు. అటువంటి వారికి వాణిజ్య పన్నులశాఖ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వకుండానే వ్యాపారుల నుంచి మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారు. మరికొందరు సర్టిఫికెట్స్ కోసం మమూళ్లు తీసుకుని ఇస్తున్నారు.

అందుకు నిదర్శనం సోమవారం కావలి ఏసీటీఓ బాలాజీసింగ్ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటమే. ఇటీవల కాలంలో నెల్లూరు సీటీఓగా పనిచేస్తున్న అధికారి నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేయగా రూ.కోట్ల అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

 ఇదీ విషయం
 జిల్లాలోని వాణిజ్యపన్నుల శాఖలో 5 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 3, గూడూరు, కావలి ప్రాంతాల్లో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉంది. జిల్లాలో ఐదుగురు సీటీఓలు, 11 మంది డీసీటీఓలు, 23 మంది ఏసీటీలు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సర్కిల్ కార్యాలయంలో వాణిజ్యపన్నుల అధికారి ఒకరు ఉంటారు. వీరంతా ప్రతినిత్యం వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవాలంటే లెసైన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు ఆయా వస్తువులును బట్టి ఒక శాతం నుంచి 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.5లక్షల నుంచి రూ.40లక్షల లోపు వ్యాపారం చేసే ప్రతి వ్యాపారి ఒక శాతం పన్నును చెల్లించాలి. అటువంటి వారు జిల్లావ్యాప్తంగా 3వేలమందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా టీఓటీ (టాట్) పరిధిలోకి వస్తారు. అందుకే వీరు రాష్ట్ర పరిధిలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పైన వ్యాపారం చేసేవారు వ్యాట్ పరిధిలోకి వస్తారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తుంటారు. ఏడాదికి రూ. 5 లక్షల లోపు వ్యాపారం చేసేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

 వ్యాట్‌కు తూట్లు... ప్రభుత్వ ఆదాయానికి గండి
జిల్లావ్యాప్తంగా 10వేలమందికి పైగా వ్యాట్ డీలర్లు ఉన్నారు. ప్రతిరోజూ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కొంతమంది వ్యాపారులు అధికారులకు మామూళ్లు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. గతంలో ఏసీబీకి దొరికిన సీటీఓపై గూడూరులో పనిచేస్తున్నడప్పుడు పలు ఆరోపణలు వచ్చాయి. బియ్యం, ఇనుము పరిశ్రమలతో పాటు సెజ్‌లకు సంబంధించిన పరిశ్రమల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా భారీ అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.

ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కొంతమేర పరిశ్రమల నుంచి పన్నులు వసూలు చేశారు. జిల్లాలోని కొన్ని పరిశ్రమలు ఎలాంటి పన్ను చెల్లించకుండా వివిధ రకాల సరుకులు, వస్తువులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ పరిశ్రమల అధినేతలు కొందరు అధికారులకు మామూళ్లు ఇచ్చి వాణిజ్యశాఖకు పన్ను చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు.

 జాక్‌పాట్ లారీల ద్వారా రవాణా
బియ్యం, ధాన్యం, వంటనూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, జీడీపప్పు, వేస్ట్‌పేపర్, డగ్స్ తదితర సరుకులకు సంబంధించి వ్యాపారులు వాణిజ్యశాఖకు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. టింబర్ సోప్స్, కాస్మోటిక్స్, కర్ర, మిషనరీ, స్పేర్స్, ఆటోమొబైల్స్ తదితర వస్తువులకు 14.5శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది వ్యాపారులు కోట్లల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నా ఏడాదిలో కేవలం రూ.5లక్షల లోపే క్రయ, విక్రయాలు చేసినట్లు లెక్కలు చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అదేవిధంగా జిల్లా నుంచి బియ్యం, చక్కెర, ధాన్యం, పప్పులు భారీగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆయిల్స్, కాస్మోటిక్స్, వేస్ట్‌పేపర్, తదితర సరుకులు జిల్లాకు రవాణా అవుతున్నాయి. పార్శిల్ రూపంలో జాక్‌పాట్ లారీల ద్వారా తరలిస్తుంటారు. అయితే వాటికి ఎలాంటి వేబిల్లులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయాన్ని కొందరు అధికారులు, వ్యాపారులు కుమ్ముక్కై పంచుకుతింటున్నారు. ఈ అక్రమాలపై ఏసీబీ అధికారలు పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు