ఆదాయమిచ్చే శాఖకు సొంతగూడు కరువు

27 Oct, 2014 00:43 IST|Sakshi
ఆదాయమిచ్చే శాఖకు సొంతగూడు కరువు

ఏలూరు (టూటౌన్) : రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే వాణిజ్యపన్నుల శాఖకు సొంత గూడు కరువైంది. దీంతో ప్రతి ఏటా లక్షలాది రూపాయలు అద్దెలను చెల్లించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రధానంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాలతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది. అయినప్పటికీ జిల్లాలో ఉన్న 9 వాణిజ్య శాఖల సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అధికారులు, సిబ్బంది పలు ఇబ్బందులకు గురవడంతో పాటు ఏటా సుమారు రూ.42 లక్షల మేర అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు -1, 2 వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి.
 
 ఇవి మొత్తం ప్రైవేటు భవనాల్లో కొనసాగడం గమనార్హం. ఈ శాఖ ద్వారా ఒక్క మన జిల్లా నుంచే గతేడాది రూ.379 కోట్లను సమకూర్చడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.221 కోట్లను వసూలు చేయడం జరిగిందని, మార్చి నాటికి రూ.430 కోట్ల వరకు సేకరిస్తామని జిల్లా వాణిజ్యపన్నుల శాఖ డెప్యూటీ కమిషనర్ కె.రవిశంకర్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువస్తున్న తమ శాఖకు సొంత భవనాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని గతంలో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను కలిశారు. దీంతో స్పందించిన ఆయన కొద్ది రోజుల్లోనే స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు డెప్యూటీ కమిషనర్ కె.రవిశంకర్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 116 వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు ఉండగా కేవలం ఒక్క తిరుపతిలోనే సొంత భవనం ఉందని విశాఖపట్నంలో మాత్రం భవన నిర్మాణ దశలో ఉన్నట్లు డీసీ చెప్పారు.
 
 కలెక్టర్ సహకారంతో భవనాల నిర్మాణం
 జిల్లాలో కలెక్టర్ సహకారంతో స్థలాలు సేకరించి పక్కా భవనాల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వాణిజ్య పన్ను శాఖ డీసీ కె.రవిశంకర్ తెలిపారు. దీనికి సంబంధించి తమ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే మన జిల్లా అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో పక్కా భవనాలకు స్ధలాలు ఉంటే మంజూరు సులభతరం అవుతుందని డీసీ చెప్పారు.
 

మరిన్ని వార్తలు