గలీజులపై డేగకన్ను

6 Sep, 2015 02:36 IST|Sakshi
గలీజులపై డేగకన్ను

- వెయ్యికి పైగా షాపులు దళారుల చేతుల్లో
- కార్పొరేషన్‌కి రూ.10 కోట్లపైనే ఆదాయం వచ్చే అవకాశం
- సర్వే నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలు
విజయవాడ సెంట్రల్ :
నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లతో వ్యాపారం చేస్తున్న బిజినెస్ మేన్ల ఆగడాలపై కమిషనర్ జి.వీరపాండియన్ డేగకన్ను వేశారు. గ‘లీజు’ల భరతం పట్టేందుకు మూడు సర్కిళ్ల పరిధిలో 12 ప్రత్యేకబృందాలను రంగంలోకి దించారు. 1000కి పైగా షాపులు సబ్ లీజుల్లో ఉన్నట్లు ఎస్టేట్స్ అధికారులు గుర్తించారు. వీరినుంచి మ్యూటేషన్ (పేరు మార్పు) చార్జీలు వసూలు చేస్తే రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఏ షాపు ఎవరి ఆధీనంలో ఉంటుందనే దానిపై నివేదిక రూపొందించే పనిలో ఎస్టేట్స్ అధికారులు తలమునకలయ్యారు.
 
ఆదాయానికి గండి

కార్పొరేషన్‌కు చెందిన 69 షాపింగ్ కాంప్లెక్సులలో 3,396 షాపులు ఉన్నాయి. రైతుబజార్లు, మీ-సేవా కేంద్రాలకు 17 కాంప్లెక్సులను కేటాయించారు. మిగిలినవన్నీ ఎస్టేట్స్ ఆధీనంలోనే నడుస్తున్నాయి. కింది సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్పొరేషన్ షాపులతో బ్రోకర్లు బిజినెస్ చేస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు బినామీ పేర్లతో షాపుల్ని దక్కించుకున్నారు. దీంతో నగరపాలక సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అతి తక్కువ అద్దెకు షాపుల్ని కైవసం చేసుకొని అంతకు మూడింతల అద్దెకు సబ్ లీజుకు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యం. నిబంధనల ప్రకారం షాపులను సబ్‌లీజుకు ఇవ్వకూడదు.

ఇద్దరు కలిసి వ్యాపారం చేసేందుకు షాపు తీసుకొని అనివార్య కారణాల వల్ల ఒకరు తప్పుకొందామనుకుంటే మ్యూటేషన్ చార్జీలు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. 30 నెలల అద్దెను మ్యూటేషన్ కింద చెల్లిస్తేనే పేరు మార్పు చేస్తారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్‌లో సబ్‌లీజుల దందా కొనసాగుతోంది. దీంతో వీటి క్రమబద్ధీకరణపై కమిషనర్ దృష్టి సారించారు. గతంతో పోలిస్తే పేరు మార్పు కోసం స్టాండింగ్ కమిటీకి వచ్చిన దరఖాస్తులు ఐదే కావటం, ఈ సంఖ్య గతంతో పోలిస్తే చాలా స్వల్పంగా ఉండటంతో షాపింగ్ కాంప్లెక్స్‌ల లీజుల్లో ఏదో తేడా జరుగుతోందని మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్‌కు సూచించారు. ఆయన పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

మరిన్ని వార్తలు