పాలకమండలి నోరు నొక్కిన ముఖ్యమంత్రి

6 Jan, 2018 16:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాంత్రిక పూజలపై నమోదైన కేసును మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. అర్థరాత్రి దుర్గగుడిలో అసలు పూజలే జరగలేదని నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

అయితే నివేదికపై వస్తున్న లీకులపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు చేసిన ఆలయ పాలకమండలి సభ్యులు మౌనం వహిస్తున్నారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకమండలి సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై పాలకమండలి సభ్యులు నోరు మెదపవద్దని ఇప్పటికే చంద్రబాబు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

అసలేం జరిగింది..
దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురి చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఈ ఘటనతో సంబంధముందనే మరో ఆరోపణ మరింత విస్తుపోయేలా చేసింది. అయితే ఈవో సూర్యకుమారి ...ఆలయంలో పూజలు జరగలేదని వివరణ ఇస్తే...పాలకమండలి సభ్యులు మాత్రం తాంత్రిక పూజలు జరిగినట్లు పేర్కొన్నారు.  దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి.. రెండు రోజుల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పూజలు జరిగాయని తేలితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

సీన్‌ రివర్స్‌..
రెండు రోజుల పాటు తాంత్రిక పూజలపై విచారణ చేయాల్సిన కమిటీ ఒక రోజుతోనే విచారణను ముగించింది. అంతేకాదు అర్థరాత్రి ఆలయంలో అసలు పూజలే జరగలేదనే లీకులు ఇచ్చింది. వాస్తవానికి నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదికను ఆదివారం కమిషనర్‌కు సమర్పించాల్సివుంది. అయితే, నివేదికపై ముందుగానే కమిటీ సభ్యులు లీకులు ఇవ్వడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమ్మవారి ముందు అలాంటి పూజలు చేసే ధైర్యం ఎవరికీ లేదని విచారణ కమిటీలోని సభ్యుడు ఒకరు అన్నట్లు తెలిసింది. దీంతో కేసును మూసేసేందుకు కమిటీని ప్రభుత్వం పావుగా వాడుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రపతి పేరు..
మరోవైపు దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారంపై చర్చలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును వాడినట్లు సమాచారం. అయితే, ఏ విషయంపై రాష్ట్రపతి పేరును తీసుకువచ్చరన్న దానిపై స్పష్టత లేదు.

ప్రభుత్వం చేసింది చిన్న అపచారం కాదు
కనకదుర్గమ్మ ఉగ్రరూపంలో ఇంద్రకీలాదిపై స్వయంభూగా వెలసింది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను తన చల్లని చూపులతో కటాక్షించాలని అమ్మవారిని వేడుకుంటూ మూలవిరాట్‌ను కళాన్యాసంతో పరిపుష్టం చేశారు. స్మార్త వైదిక ఆగమం ప్రకారం కళాన్యాసంలో 10 విభాగాల కింద మొత్తం 96 కళలు ఉంటాయి. ఈ కళలను అమ్మవారి మూలవిరాట్‌లో పరిపుష్టం చేసి, కవచం తొడిగారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు మహిమాన్వితమైన ఆ కవచాన్ని కదిపి ఘోర అపరాధానికి పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు