సాయినార్ ప్రమాదంపై తుది నివేదిక సిద్ధం

3 Jul, 2020 16:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మానవ తప్పిదం వల్లే సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుందని విచారణ కమిటీ తేల్చినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ శుక్రవారం తెలిపారు. హైడ్రోజన్ సల్ఫైడ్ గాఢత వలన ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు నివేదికలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి రూ. 35 లక్షలు, సీఎం సహాయనిధి నుంచి రూ. 15 లక్షల చొప్పున మొత్తంగా రూ. 50 లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా బాధిత కుటుంబాల్లో ఒకరికి కంపెనీలో ఉద్యోగం, అస్వస్థతకు గురైన వైద్యులకు మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు. (ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ)

కాగా విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ఓ రియాక్టర్‌ నుంచి హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ విషవాయువు లీకైన విషయం విదితమే. దీనిని పీల్చిన ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం కంపెనీని షట్‌డౌన్‌ చేయించారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీ వేయగా తాజాగా తుది నివేదికను సమర్పించింది. ముడి ద్రావకాన్ని రియాక్టర్‌కు పంపించే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని.. నాజిల్ వదులుగా ఉండడం వల్ల నేరుగా రియాక్టర్‌లోకి పైపు పెట్టడంతో వాయువు లీకైనట్లు వెల్లడించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు