గ్యాస్‌పై భగ్గుమన్న జనం

5 Jan, 2014 00:38 IST|Sakshi

 గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయా పార్టీల ఆధ్వర్యంలో శనివారం ఆందోళనలు చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, బీజేపీ ఆధ్వర్యంలో పచ్చి కూరలు తింటూ, సైకిల్ తొక్కి నిరసన తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో మెదక్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. - న్యూస్‌లైన్ నెట్‌వర్క్
 
 ఫసల్‌వాదిలో రాస్తారోకో..
 సంగారెడ్డి రూరల్: గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయమ్మ, టీడీపీ నాయకుడు సాయన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలను పెంచుతోందని విమర్శించారు. ధరల పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరను భారీగా పెంచడం దారుణమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో టీడీపీ నాయకులు లక్ష్మి, కల్పలత, కృష్ణవేణి, అమృత, సుజాత తదితరులు పాల్గొన్నారు.
 
 బీజేపీ ఆధ్వర్యంలో నిరసన..
 సంగారెడ్డి మున్సిపాలిటీ: పెరిగిన ధరలతో గ్యాస్ కొనలేమంటూ పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట పచ్చి కూరగాయలు తింటూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.  జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో సామాన్యులు బతకడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, వెంకటనర్సింహారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అనంతరావు కులకర్ణి, నాయకులు నర్సింహారెడ్డి, రమేశ్, విజయలక్ష్మి, వాసు, మీడియా ఇన్‌చార్జి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
 మెదక్ టౌన్: ఇంధన చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం నాయకులు పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భం గా ఆ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ ఏడాదిలో 12సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిన ఘనత యూపీఏకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గీత, యశోద, బాల్‌రాజ్, మాణిక్యం, కవిత, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు