గ్యాస్ ధర పెంపుపై మిన్నంటిన ఆందోళనలు

3 Jan, 2014 02:22 IST|Sakshi

 వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో
 ఖాళీ సిలిండర్లతో ఆందోళన
 సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ
 దిష్టిబొమ్మలు దహనం
 
 కర్నూలు, న్యూస్‌లైన్:
 గ్యాస్ సిలిండర్‌ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్య జనంపై అదనపు భారాన్ని మోపడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తింది.  జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో కర్నూలులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం దగ్గర ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమ్మ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో వంట గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ ఆ భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తు చేశారు.
 
 పేద ప్రజల సంక్షేమం కోసమే మహానేత ఆనాడు అదనపు భారాన్ని భరించినట్లు గుర్తు చేశారు. అలాగే సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పూల బజార్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయకపోతే యూపీఏ-2 ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పత్తికొండలో సీపీఎం ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నందికొట్కూరులో సీపీఎం కార్యాలయం నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తనిఖీ నిమిత్తం వెళ్లిన కర్నూలు ఆర్‌డీఓ కూర్మానాథ్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఆలూరులో టీడీపీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

మరిన్ని వార్తలు