దివికేగిన అరుణతార

19 Jan, 2019 14:09 IST|Sakshi
తెలకపల్లి నరసింహయ్యకు నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

కమ్యూనిస్టు ఉద్యమ నేత తెలకపల్లి నరసింహయ్య కన్నుమూత

రేపు కర్నూలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అరుణతార దివికేగింది. ప్రజా ఉద్యమ సారథి తన ప్రస్థానాన్ని ముగించారు. అవిశ్రాంత ప్రజా సేవకుడు, జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నేత తెలకపల్లి నరసింహయ్య(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లోని నివాసగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన1928 జూన్‌ 8న కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన తెలకపల్లి రామయ్య, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉన్నారు. అప్పట్లో చండ్ర పుల్లారెడ్డి, మండ్ల సుబ్బారెడ్డి, ఎర్రగుడి ఈశ్వరరెడ్డి, కర్నూలు సుంకన్న, పాణ్యం గఫూర్‌ వంటి నాయకులతో కలిసి పనిచేశారు. తర్వాత కాలంలో సీపీఎం ఏర్పడినప్పటి నుంచి 2005 వరకు జిల్లాలో పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. 1970 నుంచి 1997 వరకు జిల్లా కార్యదర్శిగా, 1978 నుంచి 2002 వరకు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు 1945లో టీసీ లక్ష్మమ్మతో వివాహమైంది. చంద్రం, తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు), హరి సంతానం. నరసింహయ్యతో పాటు టీసీ లక్ష్మమ్మ కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. నరసింహయ్య కమ్యూనిస్టుగా పని చేయడమే కాకుండా  మొత్తం కుటుంబాన్ని ఉద్యమంలోకి తేగలిగారు.  

రేపు అంత్యక్రియలు
నరసింహయ్య పార్థివదేహం శుక్రవారం రాత్రి కర్నూలుకు చేరుకుంది. అంత్యక్రియలను ఆదివారం (20వ తేదీ) నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉంచుతారని, తర్వాత అక్కడి  నుంచి అంతిమయాత్ర  ప్రారంభమై 11 గంటలకు జమ్మిచెట్టు హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి తెలిపారు. నరసింహయ్య మరణం  పార్టీకే కాదు.. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని సీపీఎం నాయకులు ప్రభాకరరెడ్డి, టి.షడ్రక్, బి.రామాంజనేయులు, గౌస్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటు తనంతో పాటు ప్రజా, కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. నరసింహయ్య మృతికి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా