బెల్ కంపెనీ.. తరలిపోతోంది

28 Aug, 2015 02:49 IST|Sakshi
బెల్ కంపెనీ.. తరలిపోతోంది

మచిలీపట్నం : మచిలీపట్నానికి మణిహారంగా ఉండి దేశ రక్షణ శాఖకు కీలకమైన పరికరాలను ఉత్పత్తి చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను పామర్రు మండలం నిమ్మలూరుకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. నిమ్మలూరు రెవెన్యూ పరిధిలోని 50.54 ఎకరాల భూమిని సేకరించేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం బస్టాండ్ పక్కనే ఉన్న బెల్ కంపెనీని నిమ్మలూరుకు తరలించి రూ.110 కోట్ల వ్యయంతో అక్కడ నూతనంగా ఈ కంపెనీని నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్ కంపెనీకి ఇచ్చే భూమి నిమ్మలూరు సమీపంలో ఉన్నా నిమ్మకూరుకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ కంపెనీని తరలించేందుకు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, విజయవాడలోని ఓ స్టార్ హోటల్ యజమాని దగ్గరి బంధువు, బందరు బెల్ కంపెనీలో అత్యున్నత పదవిలో ఉన్న ఓ ఉద్యోగి తెరవెనుక మంత్రాంగం నడిపారనే వాదన వినిపిస్తోంది.

దేవాదాయశాఖ భూముల్లో బెల్
పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరు వద్ద బెల్ కోసం సేకరించనున్న 50.54 ఎకరాల భూమి మచిలీపట్నంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధీనంలో ఉంది. గతంలోనే ఇక్కడ బెల్ కంపెనీని నిర్మించేందుకు ప్రతిపాదన చేయగా, దేవస్థానం ట్రస్టీలు అంగీకరించక కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులు తెరవెనుక మంత్రాంగం నడిపి.. ఆలయ ట్రస్టీలు అంగీకరిస్తే ఈ భూమిని బెల్ కంపెనీ కోసం తీసుకోవచ్చని దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి లేఖ రాయించినట్లు కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. పాలకుల ఒత్తిడి మేరకు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ ట్రస్టీలతో సంప్రదింపులు జరిపి ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేశారు. బెల్ కంపెనీని విస్తరించేందుకు మచిలీపట్నం గోసంఘానికి చెందిన 25 ఎకరాల భూమి కేటాయించేందుకు అప్పట్లో కలెక్టర్‌గా పనిచేసిన రిజ్వీ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకొచ్చాక బెల్ కంపెనీని నిమ్మకూరు సమీపానికి తరలించేందుకు గట్టి ప్రయత్నాలు జరగటం గమనార్హం.
 
 ప్రజా ఉద్యమాలతో అడ్డుకుంటాం...

 బందరులోని ఏకైక పరిశ్రమను నిమ్మలూరుకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దీనిని ప్రజాఉద్యమం ద్వారా అడ్డుకుని తీరుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లు రవీంద్ర తన మంత్రి పదవి కోసం బెల్ కంపెనీని తాకట్టు పెట్టి జన్మనిచ్చిన ఊరుకు అన్యాయం చేశారన్నారు. బెల్ కంపెనీని మచిలీపట్నంలోనే విస్తరిస్తామని ఒకటికి పదిసార్లు మాట ఇచ్చిన మంత్రి తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని బెల్ కంపెనీ తరలిపోకుండా ఉద్యమం చేస్తామని చెప్పారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనరు షేక్ సలార్‌దాదా, నాయకులు లంకే వెంకటేశ్వరరావు, చిటికిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు