పరిహారం భోంచేశారు

21 Nov, 2014 06:40 IST|Sakshi
  • టీడీపీ నేతలపై గుడివాడ అమర్‌నాథ్ విమర్శ
  • మల్కాపురం: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ నాయకులు వారికి వచ్చిన పరిహారాన్ని భోంచేశారని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. గురువారం మల్కాపురం మరిడిమాంబ కల్యాణ మండపంలో జరిగిన పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 45 నుంచి 49వ వార్డు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నాయకులు స్టువర్టుపురం దొంగలను తలపిస్తున్నారని విమర్శించారు.

    హుద్‌హుద్ తుపాను బాధితులకు పరిహారం పంపిణీలోను పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. దివంగత సీఎం వైస్ హయాంలో అర్హులు ప్రతిఒక్కరికీ పింఛను మంజూరు చేస్తే నిబంధనల పేరిట అర్హులకు తొలగించి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. రైతులకు, డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు.

    కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని నగరంపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని, తుపానుకు దెబ్బతిన్న గ్రామాలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించిన ఏ నాయకుడైనా వారి మదిలో నిలిచిపోతారని, ఆ స్థానాన్ని దివంగత సీఎం వైఎస్ సంపాదించారని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు.

    రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు. వైఎ స్సా ర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి,బీసీ సెల్ నాయకులు పక్కి దివాకర్, మాజీ కార్పొరేటర్లు కలిదండి బద్రినాథ్, దాడి సత్యనారాయణ, మాటూరి చిన్నారావు  పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు