పరిహారం చెక్కుల గల్లంతు

7 Jun, 2014 02:17 IST|Sakshi
పరిహారం చెక్కుల గల్లంతు

ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఏపీ జెన్‌కో సీవాటర్ ఇంటేక్ ప్లాంటు నిర్మాణం కోసం నేలటూరు  పట్టపుపాళెంలో సేకరించిన భూములకు సంబంధించి చనిపోయిన వారి పేర్లతో పరిహారం స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై నెల్లూరు ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి శుక్రవారం పట్టపుపాళెంలో విచారణ చేపట్టారు.
 
 మత్స్యకారుల ఫిర్యాదు ప్రకారం..జెన్‌కో ప్రాజెక్టు చేపట్టిన సీవాటర్ ఇంటేక్‌ప్లాంటు నిర్మాణం కోసం 10 నెలల క్రి తం గంగపుత్రులకు చెందిన సీజేఎఫ్‌ఎస్ భూములు 34 ఎకరాలు సేకరించారు. 318, 321 సర్వే నంబర్లలోని ఈ భూముల్లో మొదటి విడతగా 28 ఎకరాలకుగాను 28  మందికి రూ 6.65 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. అప్పటి ఆర్‌డీఓ మాధవీలత, ముత్తుకూరు తహశీల్దార్ సుశీలమ్మ పర్యవేక్షణలో ఈ చెక్కు లు పంపిణీ జరిగింది.
 
 రెండో విడతలో మరో 6 ఎకరాలకు 6 చెక్కులు సిద్ధం చేశారు. వీరిలో ముగ్గురికి మాత్రమే చెక్కులు అందాయి. మి గిలిన ముగ్గురిలో కోలంగారి అబ్బయ్య, కోడి చిననరసింహలు చనిపోయారు. బసవంగారి పోతయ్య మాత్రం ఉన్నాడు. వీరి చెక్కులను మాత్రం అధికారులు కాజేశారు. దీని వెనుక ఆర్‌డీఓ కార్యాలయంలో డీటీగా ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే ఉద్యోగి హస్తం కూడా ఉంది. సాధారణంగా పరిహారం చెక్కులు ఇచ్చే ముం దు వీఆర్వో,ఆర్‌ఐలు రిపోర్టు రాస్తే, చెక్కు ఇచ్చేందుకు ఆర్‌డీఓ కార్యాలయానికి తహశీల్దార్ సిపార్సు చేస్తారు. అయితే అలా జరగలేదు.  వీఆర్వో పోలయ్య ద్వారా ముగ్గురు బినామీ వ్యక్తులతో నగదు డ్రా చేశారని మత్స్య కారులు ఆరోపిస్తున్నారు.
 
 సొమ్ము రికవరీ చేస్తాం:ఆర్‌డీఓ
 పరిహారం సొమ్ము గల్లంతయినట్టు గుర్తించిన మత్స్యకారులు కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యేశ్వరెడ్డి పట్టపుపాళెంలో విచారణ జరిపించారు. రెండో విడత కింద పంపిణీ అయిన ఆరు చెక్కులపై విచారణ జరిపారు. ఈ మూడు చెక్కుల పరిహారం మొత్తాన్ని రికవరీ చేస్తామన్నారు.
 

>
మరిన్ని వార్తలు