బెంగపుత్రులు

3 May, 2018 11:20 IST|Sakshi
దిగాలుగా తెడ్డు పరసయ్య భార్యా,పిల్లలు

గల్లంతైతే అందని పరిహారం

దరిచేరని ప్రభుత్వ పథకాలు

ఇదీ పెదజాలారీపేట మత్స్యకారుల దుస్థితి

పెదవాల్తేరు(విశాఖతూర్పు): వారికి గంగమ్మ తల్లే జీవనాధారం.. చేపల వేటకు వెళితేగాని పూట గడవదు.. సముద్రంలోకి వెళ్లిన వారు ఇంటికొస్తారన్న గ్యారంటీ లేదు.. పోనీ ప్రాణాలకు తెగించి పట్టుకున్న చేపలకు గిట్టుబాటు ధర వస్తుందా అంటే అదీ లేదు. చేపల వ్యాపారులు సిండికేట్‌గా మారి మత్స్యకారుల శ్రమను దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.జీవీఎంసీ పరిధి 17వ వార్డు పెదజాలారిపేటలో 4 వేల వరకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 1984లో జిల్లా గృహనిర్మాణ సంస్థ పక్కా ఇళ్లు కట్టించింది. ఇదిలా ఉండగా ఇదే గ్రామం నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతవడం, ఒకరి మృతదేహం లభ్యం కావడం తెలిసిందే. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డు సిబ్బంది గాలిస్తున్నా ఫలితం కానరావడం లేదు. వారి కోసం బాధిత కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తొలి పోస్టుమార్టం
ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి వేటకు వెళ్లిన చనిపోయిన మత్స్యకారులను పోస్టుమార్టం చేసింది లేదు. వీరి ఆచారం ప్రకారం మృతదేహంపై కత్తిగాటుకు కుటుంబ సభ్యులు ససేమిరా అనే వారు. అయితే మత్స్యకార నాయకులు నచ్చజెప్పడంతో తొలిసారిగా కేజీహెచ్‌లో బుధవారం పోలిరాజు మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. కాగా.. సముద్రంలో గల్లంతయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ పరిహారం అందడం లేదు. కేవలం గల్లంతు కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని నాయకులు మండిపడుతున్నారు.

కుల వృత్తినే నమ్ముకుని.. : పెదజాలారిపేటలో జీవీఎంసీ పాఠశాల ఉంది. చాలామంది పదో తరగతి వరకు చదువుతున్నారు. సరైన ఉపాధి దొరకకపోవడంతో వీరు కూడా చేపల వేటనే వృత్తిగా స్వీకరిస్తున్నారు. ఏడాదిలో వీరు 200 రోజులు చేపల వేటకు వెళతారు. చేపలు దొరక్కుండా వెనక్కి వచ్చేస్తున్న రోజులు చాలానే ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.  
గుర్తింపు కార్డులు లేవు: పెదజాలారిపేటలోని మత్స్యకారుల్లో  70 శాతం మంది మత్స్యకారులకు మాత్రమే గుర్తింపు కార్డులు ఉన్నాయి. మిగిలిన వారి కార్డులు  మత్స్యశాఖ కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని  ఆందోళన చెందుతున్నారు.

మత్స్యకారుల గల్లంతుపై కేసు నమోదు
పెదవాల్తేరు(విశాఖతూర్పు):పెదజాలారిపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని వారి కుటుంబ సభ్యులు బుధవారం ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారులు తెడ్డు పరసయ్య (43), తెడ్డు పెంటయ్య (48) మంగళవారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వెళ్లి వర్షానికి గల్లంతు కావడం తెలిసిందే. దీంతో పరసయ్య భార్య పోలి, పెంటయ్య భార్య పోలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ఎంవీపీ సీఐ మళ్ల మహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.   

గల్లంతయినా పరిహారం ఇవ్వాలి
సముద్రంలో గల్లంతయిన వారి మృతదేహం దొరికితేనే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామనడం అన్యాయం. గల్లంతయిన వారిని చనిపోయిన వారుగా పరిగణించి పరిహారం అందించాలి. పరిహారం అందకపోవడంతో వారి కుటుంబాలకు ఆసరా ఉండటం లేదు.– తెడ్డు సత్యరాజు, మత్స్యకారుడు, పెదజాలారిపేట

మరిన్ని వార్తలు