డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్‌ మరో షాక్‌

24 Nov, 2018 08:30 IST|Sakshi

ఎస్‌జీటీ పోస్టుల కుదింపు

250 పోస్టులను పీఈటీ పోస్టులుగా మారుస్తూ జీవో విడుదల

ఇప్పటికే టెట్‌ కమ్‌ టీఆర్‌టీతో అవస్థలు

పరీక్షల ముందు సిలబస్, ప్రశ్నల స్థాయిని పెంచిన ప్రభుత్వం

తాజాగా పోస్టుల మార్పుతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన

పరీక్ష సమయంపై గందరగోళం

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018కి సంబంధించి రోజుకో నిర్ణయం వెలువరిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. పరీక్షలు మరో 12 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో 250 ఎస్‌జీటీ పోస్టులను పీఈటీ పోస్టులుగా మార్పు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 79 జారీ చేసింది. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2.30 గంటలకు కుదించింది. దీనిపై నిరుద్యోగులు అగ్గిమీద గుగ్గిలమవడంతో తిరిగి మూడు గంటలకు మారుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

తగ్గిపోయిన ఎస్‌జీటీ పోస్టులు 372
డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌లో భాగంగా 7,729 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆ తర్వాత మరో 173 పోస్టులను కలిపింది. మొత్తం పోస్టుల్లో 47 మాత్రమే పీఈటీ పోస్టులు. దీనిపై పీఈటీ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వానికి పోస్టుల సంఖ్యను పెంచాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట అంగీకరించకుండా ఎస్‌జీటీ పోస్టులను పీఈటీ పోస్టులుగా మార్చి పీఈటీ పోస్టులను 372కి పెంచి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఫలితంగా ఎస్‌జీటీ పోస్టులు 4,211 ఉండాల్సి ఉంటే 3,839 మిగిలాయి. 122 పోస్టులను గతంలోనే పీఈటీ పోస్టులుగా మార్చారు.

ఎస్‌జీటీ పోస్టులకు పోటీ తీవ్రం
గతంలో కేవలం డీఎడ్‌ చేసిన వారికి మాత్రమే ఎస్‌జీటీ పోస్టులకు అర్హత ఉండగా ఈసారి బీఈడీ చేసినవారికి, బీటెక్‌తో బీఈడీ చేసినవారికీ అవకాశం కల్పించారు. ఫలితంగా ఈ పోస్టులకు గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ పెరిగింది. ఎస్‌జీటీ పోస్టులకు టెట్‌ కమ్‌ టీఆర్‌టీ–2014లో కేవలం 58 వేల మంది మాత్రమే పోటీపడగా ఈసారి 3,45,733 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంటే.. ఒక్కసారిగా ఆరు రెట్లు పోటీ పెరిగింది. ఒక్కో ఎస్‌జీటీ పోస్టుకు దాదాపు వందమంది చొప్పున పోటీపడుతున్నారు. అభ్యర్థులు లక్షల్లో ఉన్న తరుణంలో పోస్టులను పెంచాల్సింది పోయి ఉన్న పోస్టుల్లోనే కోతపెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. పీఈటీ పోస్టులు పెంచాలని భావిస్తే ప్రభుత్వం కొత్త పోస్టులు ఇవ్వాలి. కానీ ఎస్‌జీటీ పోస్టులకు కోత పెట్టి నిరుద్యోగుల కడుపుకొడుతోంది.

టెట్‌ కమ్‌ టీఆర్‌టీతో సతమతం
ఈసారి టీచర్‌ పోస్టుల భర్తీలో ఎస్‌జీటీ పోస్టులకు టెట్‌ కమ్‌ టీఆర్‌టీని, ఇతర పోస్టులకు డీఎస్సీని ప్రకటించారు. టెట్‌ను కలపడంతో అభ్యర్థులు డీఎస్సీ సిలబస్‌తోపాటు టెట్‌ సిలబస్‌ను కూడా చదవాల్సి వస్తోంది. డీఎస్సీలో 160 ప్రశ్నలు మాత్రమే ఉండేవి. కానీ టెట్‌ కమ్‌ టీఆర్‌టీలో ఆ ప్రశ్నల సంఖ్య 200కు పెరిగింది. డీఎస్సీని ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్‌జీటీలో ప్రశ్నల సంఖ్య పెరగడం, పరీక్ష సమయం కుదింపు, అవగాహన లేని ఆన్‌లైన్‌ పరీక్షతో మరిన్ని కష్టాలు తప్పవని వాపోతున్నారు.

పరీక్ష సమయంపై గందరగోళం
డీఎస్సీ నోటిఫికేషన్‌కు, పరీక్షల షెడ్యూల్‌కు మధ్య సమయం చాలా తక్కువగా ఉందని, తమ సన్నద్ధతకు సమయం చాలదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. పైగా నోటిఫికేషన్‌ వెలువరించిన తర్వాత సిలబస్‌ను ప్రకటించడంతో ఆ సమయం కూడా కుదించుకుపోయింది. ముందు ఎస్‌జీటీ పోస్టులకు ఎనిమిదో తరగతి వరకు ఉన్న అంశాలకే పరిమితం చేస్తూ సిలబస్‌ను ప్రకటించారు. సరిగ్గా పరీక్షలకు పక్షం రోజుల ముందు ఈ సిలబస్‌ను పదో తరగతి అంశాలతో సమానం చేయడంతో పాటు డీఎస్సీలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయని కొత్త నిబంధన విధించారు. దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. గోరుచుట్టుపై రోకటిపోటులా పరీక్ష సమయంపై కూడా అభ్యర్థులను అయోమయానికి గురిచేశారు. నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు అరగంట కోతపెట్టి దాన్ని 2.30 గంటలకు కుదించారు. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో శుక్రవారం అర్ధరాత్రివేళ తిరిగి పరీక్ష సమయాన్ని మూడు గంటలకు పెంచుతూ తాజా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

మరిన్ని వార్తలు