ఒక పోస్టుకు 62 మంది పోటీ

20 Nov, 2018 08:57 IST|Sakshi

డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు తీవ్ర పోటీ

ఎస్‌ఏలు, లాంగ్వేజ్‌ పండిట్‌ల పరిస్థితీ అంతే..

జిల్లాలో మొత్తం ఖాళీలు 764.. దరఖాస్తులు 52,933

ఆరిలోవ(విశాఖ తూర్పు): జిల్లాలో డీఎస్సీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో విశాఖ జిల్లాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల అభ్యర్థులు కూడా ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. విశాఖ జిల్లాలో సెకండరీ గ్రేడ్, స్కూల్‌ అసిస్టెంట్లు, ల్యాంగ్వేజి పండిట్‌లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్‌ విభాగాలలో మొత్తం 764 ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు గడువు ఈ నెల 18 సాయంత్రంతో ముగిసింది.

ఆ సమయానికి జిల్లాలో అన్ని ఖాళీలకు 52,933 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర నెలకొంది. మొత్తం పోస్టులకు వచ్చిన దరఖాస్తులను బట్టి ఒక ఉద్యోగానికి 69 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సెకండరీ గ్రేడ్‌లో ఒక ఉద్యోగానికి 62 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌లో ఒక ఉద్యోగానికి 133 మంది, భాషా పండిట్‌లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్‌లలో ఒక ఉద్యోగానికి 149 మంది చొప్పున పోటీ నెలకొంది. ప్రభుత్వం 2014 తర్వాత నాలుగేళ్ల పాటు డీఎస్సీ నియామకాలు జరపకపోవడంతో ఇంత తీవ్రమైన పోటీ ఏర్పడిందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రతి ఏడాది ఉపాధ్యాయ నియామకాలు జరిపి ఉంటే ఇంత తీవ్రమైన పోటీ ఉండేది కాదని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

ఖాళీలు.. దరఖాస్తులు
జిల్లాలో ఎస్జీటీ 639 ఖాళీలుండగా వాటి కోసం 39,631 మంది దరఖాస్తులు చేశారు.
ఎస్‌ఏలు(స్కూల్‌ అసిస్టెంట్లు) 54 ఖాళీలుండగా వాటి కోసం 6,122 మంది దరఖాస్తులు చేశారు.
భాషా పండిట్‌లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్‌ పోస్టులు 48 ఖాళీలుండగా.. వాటి కోసం 7,180 దరఖాస్తులు వచ్చాయి.

మరిన్ని వార్తలు