విశాఖ: ఐదో రోజు కొనసాగుతున్న సిట్‌ ఫిర్యాదులు

5 Nov, 2019 14:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధ్వర్యంలో ‌ఫిర్యాధుల స్వీకరణ నేటితో ఐదో రోజుకు చేరుకుంది.  సిట్ చీఫ్ విజయ్‌ కుమార్, సిట్ సభ్యులు అనురాధ, జస్టిస్ భాస్కర్‌రావు మంగళవారం ఫిర్యాదుల స్వీకరణను పరిశీలించారు. సిట్ చైర్మన్ విజయకుమార్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..  గత నాలుగు రోజులుగా 661 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. సిట్ పరిధిలోకి రాని ఫిర్యాదులను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భూ అక్రమాలు, రికార్డులు ట్యాంపరింగ్ ఫిర్యాదులను కూడా సిట్ పరిధిలోకి చేరుస్తున్నామని వెల్లడించారు. 

సిట్ ద్వారా బాధితులకి భరోసా కల్పించాలన్నదే.. సిట్ ఉద్దేశమని చెప్పారు. ఈ నెల 7వ తేదీ వరకు సిరిపురం చిల్డ్రన్ ఎరీనా ప్రాంగణంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని వివరించారు. నవంబర్‌ 8వ తేది నుంచి ఇరిగేషన్ గెస్ట్హౌస్ వద్ద సిట్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని, ఫిర్యాదులలో వచ్చిన వాటిని పరిశీలించి అవసరమైతే క్షేత్రస్ధాయిలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక నంబర్ కేటాయిస్తున్నామని.. ఫిర్యాదు సంఖ్య ఆధారంగా స్టేటస్ తెలుస్తుందన్నారు.

సిట్ పరిధిలోకి రాని వాటిపై ఏ విధంగా న్యాయం జరుగుతుందనే అంశంపై బాధితులకు ముందుగానే సూచనలిస్తామని సిట్ సభ్యులు అనురాధ, భాస్కర రావు అన్నారు. కాగా సోమవారం నుంచి ఫిర్యాదుదారుల తాకిడి పెరిగిందని తెలిపారు. భీమునిపట్నం, పెందుర్తి, గాజువాక, విశాఖ రూరల్ మండలాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. సిట్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికపుడు పరిశీలించి, ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు