ఆసరా కోసం గాబరా

5 Jun, 2018 11:35 IST|Sakshi
పోలీసు ప్రజాదర్బార్‌లో ఎస్పీని కలిసి సమస్య చెప్పుకుంటున్న వృద్ధుడు చెన్నాపురం మాదన్న

కన్నవారిని భారంగా భావిస్తున్న పిల్లలు

పోలీస్‌ దర్బార్‌కు పెరుగుతున్న వినతులు

అవసాన దశలో ఆసరా కోసం వృద్ధులు గాబరా పడుతున్నారు. వృద్ధాప్య దశలో ముద్ద బువ్వకు నోచుకోకపోవడంతో పాటు కొడుకు, కోడళ్ల నుంచి సూటిపోటి మాటలకు చిక్కి శల్యమవుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పెంచిన కొడుకులే కూడు పెట్టకుండా ఇంటి నుంచి గెంటేస్తుంటే విలవిల్లాడిపోతున్నారు. మనుసు చంపుకొని జిల్లా కేంద్రంలోని ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇక్కడా నెలల తరబడి సమస్యపరిష్కారం గాకపోవడంతోకుమిలిపోతున్నారు.

కర్నూలు: తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన పిల్లలు వారిని భారంగా భావిస్తున్నారు. ఆసరాగా ఉన్న ఆస్తిని సైతం లాక్కొని అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారం వారం జరిగే పోలీసు ప్రజాదర్బార్‌లో ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం రోజు కూడా ఇద్దరు వృద్ధ దంపతులు ప్రజాదర్బార్‌లో ఎస్పీని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.  సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ పోలీసు ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్‌ చేసుకున్నారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 73 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ షేక్షావలి, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీ వెంకటాద్రి, సీఐ ములకన్న పాల్గొన్నారు.

పోలీసు ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
తహసీల్దార్‌ కార్యాలయంలో కోఆర్డినేటర్‌ కింద సర్వే చేసే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి మోసం చేశాడని, విచారణ జరిపి అతడి నుంచి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కర్నూలు అశోక్‌నగర్‌కు చెందిన భాస్కర్‌ ఫిర్యాదు చేశాడు.  
గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామానికి చెందిన దళారి శ్రీకాంత్‌ తమ నుంచి ధాన్యం కొనుగోలు చేసి 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తానని మోసం చేశాడని పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌ గ్రామానికి చెందిన రైతులు స్వాములు, శ్రీను, వెంకటేశ్వర్లు, పెద్ద మల్లయ్య ఫిర్యాదు చేశారు. కష్టపడి పండించిన వరి పంట బస్తాలను కొనుగోలు చేసి రెండు లారీల్లో తీసుకెళ్లి శ్రీకాంత్‌ కనిపించకుండా అదృశ్యమయ్యాడని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు సాయిచంద్ర, శాంతకుమారిలపై ఒత్తిడి తెస్తే డబ్బులు చెల్లిస్తామని గడువు తీసుకొని మాటమారుస్తున్నారని విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా రైతులు వేడుకున్నారు.  
ఇంటి నిర్మాణాన్ని పక్కన ఉన్న ఇంటి వారు అడ్డుకుంటున్నారని కర్నూలు నరసింహారెడ్డి నగర్‌కు చెందిన పద్మ ఫిర్యాదు చేశారు. ఇల్లు కట్టుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.  
జొహరాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లలితా నగర్‌లో 150, 151 సర్వే నెంబర్లలో 6 ఎకరాల 15 సెంట్లలో ప్లాట్లు వేసి విక్రయించి వాటిపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇద్దరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు ఫిర్యాదు చేశారు.  

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఎల్లమ్మ కూతురి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తల్లి వద్దే ఉంటోంది. అయితే తన పేరు మీద ఉన్న ఇంటిని ఆక్రమించుకునేందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, విచారించి న్యాయం చేయాలని ఎల్లమ్మ ఎస్పీని వేడుకుంది.

ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన మాదన్నకు ఇద్దరు కుమారులు కాగా ఆస్తిని సమానంగా పంచేందుకు సిద్ధపడగా అధిక పంటలు పండే భూమి తనకివ్వాలని నాసిరకం పొలం తమ్ముడికి కట్టబెట్టాలంటూ పంపిణీ జరగకుండా అడ్డుకుంటున్నాడని విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఎస్పీని కలిసి వేడుకున్నాడు. ఆసరా కోసం తన పేరుతో బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా తనకివ్వాలని పెద్దకుమారుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మాదన్న కన్నీటి పర్యంతమయ్యాడు.

మరిన్ని వార్తలు