స్పందనపై నమ్మకాన్ని పెంచండి 

16 Nov, 2019 19:08 IST|Sakshi
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌

‘‘ స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి. అర్జీదారులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత. అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే  లక్ష్యం కావాలి. స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎన్నో ఆశలతో వస్తారు. వారి సమస్యలకు అధికారులు పరిష్కారం చూపగలిగితే ఎంతో సంతో షిస్తారు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ పేర్కొన్నారు.  శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో స్పందనపై చిత్తూరు, వెఎస్సార్‌ కడప జిల్లాల పరిధిలోని ఉన్నతాధికారులకు ప్రాంతీయ స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, ప్రత్యేకాధికారి డాక్టర్‌ హరికృష్ణ, రాష్ట్ర మున్సిపల్‌ అడ్మిని్రస్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం బృంద చర్చ నిర్వహించారు. అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. 

యూనివర్సిటీ క్యాంపస్‌ : స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  కార్యదర్శి సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌ అధికారులకు సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి అర్జీలు సమరి్పంచేందుకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని, వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారు. అర్జీలపై విచారణ జరిపి వాటిని వెబ్‌సైట్‌లో పెట్టాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించి అధికారులకు నాణ్యమైన స్పందన జరిపేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుపతిలో స్పందనపై చిత్తూరు, వైఎస్సార్‌  జిల్లాల పరిధిలో ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే వారం నుంచి  స్పందన మెరుగ్గా ఉండేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.  


హాజరైన అధికారులు, (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న సీఎం స్పెషలాఫీసరు

  • రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు మానిటర్‌ చేసుకుంటూ ఉండాలన్నారు. అర్జీలను తిరస్కరించే సమయంలో ఆలోచించి చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 45,665 ఫిర్యాదులు వస్తే అందులో 8,239 ఫిర్యాదులు తిరస్కరింపబడ్డాయన్నారు. వైఎస్సార్‌ జిల్లాకు సంబంధించి 49,131 సమస్యలు వస్తే 5,476 సమస్యలు తిరస్కరించారని చెప్పారు.  
  • సీఎం ప్రత్యేక అధికారి డాక్టర్‌ హరికృష్ణ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలు చాలావరకు చిన్నచిన్న సమస్యలేనని, వీటిని సకాలంలో పరిష్కరించగలిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పా రు. అయితే చాలా మంది అధికారులు స్పందనలో వచ్చే అర్జీలను పరిశీలించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.  
  • కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలు సలహాలు, సూచనలు వస్తుంటాయని వాటిని స్వీకరించాలని చెప్పా రు. అధికారులు వివిధ రకాల పనుల్లో ఉన్నప్పటికీ, స్పందనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  
  • వైఎస్సార్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ స్పందనపై నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. స్పందనలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు వస్తున్నాయని తెలిపారు.  
  • చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల అధికారులకు స్పందన నిర్వహణపై గ్రూప్‌ డిస్కషన్‌  నిర్వహించారు. రెవెన్యూ శాఖ జాయింట్‌ సెక్రటరీ వెట్రిసెలి్వ, డీఐజీ రాజశేఖర్‌ బాబు, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, జేసీ– 2.చంద్ర మౌళి, ట్రైనీ కలెక్టర్‌ çపృధ్వీతేజ్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌ గిరీష, మదనపల్లె సబ్‌–కలెక్టర్‌ కీర్తి చేకూరి, తిరుపతి,చిత్తూరు ఆర్డీవోలు కనక నరసారెడ్డి,  సి.రేణుక, డీఆర్‌వో విజయ చందర్, మునిసిపల్‌ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 


గ్రూప్‌ డిస్కషన్‌ విజయవంతం  
ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అధికారులకు నిర్వహించిన గ్రూప్‌ డిస్కషన్‌ విజయవంతమైందని సీఎం స్పెషలాఫీసర్‌ హరికృష్ణ చెప్పారు. అధికారులు పలు అంశాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు.  మున్సిపల్‌ అడ్మిని్రస్టేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌ అన్ని స్థాయిల్లో జరగాలని తెలిపారు.  

చెవిరెడ్డికి సీఎంవో అధికారుల కితాబు 
తిరుపతి రూరల్‌ : రాష్ట్రంలోనే వినూత్నంగా, ఆదర్శవంతంగా స్పందన కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కితాబు ఇచ్చారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో స్పందన కార్యక్రమంపై అధికారులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి వర్క్‌షాపులో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సాల్మన్‌ ఆరోగ్యరాజ్, స్పందన కార్యక్రమం రాష్ట్ర కో–ఆర్డినేటర్, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్‌ హరికృష్ణతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులను కేవలం బాధితులుగా, ఫిర్యాదుదారులుగా కాకుండా, అతిథులుగా చూస్తూ వారికి టీ, స్నాక్స్‌తో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారని సీఎంవో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకోసం ఎమ్మెల్యే రూ.7 లక్షల సొంత నిధులను సైతం అందించటం అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. స్పందన కార్యక్రమం నిర్వాహణలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చెవిరెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇదే స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుందని సూచించారు.  
    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా