నీళ్లివ్వకుంటే ప్రాజెక్టుల ముట్టడి

7 Aug, 2018 07:29 IST|Sakshi
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లివ్వకుంటే సంబంధిత ప్రాజెక్టులను ముట్టడిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. నీళ్లిచ్చేదీ, లేనిదీ చెప్పడానికి ఈ ఒక్కరోజే గడువు అని కలెక్టర్‌తో స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల మేర నీళ్లున్నా హంద్రీ–నీవా, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, వెలుగోడు, కేసీ కెనాల్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఆగస్టు రెండు నుంచి నీటిని విడుదల చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కాలవ శ్రీనివాసులు, జలవనరుల శాఖాధికారులు ప్రకటించినా.. ఇంతవరకు అతీగతీ లేదన్నారు.

సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నాయకులు గంగుల బిజేంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణను ఆయన కార్యాలయంలో కలిసి ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ తనకు ఒక్కరోజు సమయమిస్తే జలవనరుల శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని నీటిని విడుదల విషయాన్ని చెబుతాననడంతో  అందుకు వారు అంగీకరించారు. నీళ్లు విడుదల చేసేదీ, లేనిదీ ఒక్కరోజులో చెబితే దాని ప్రకారం రైతుల పక్షాన పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు శ్రీశైలం నీటిని కర్నూలు జిల్లా రైతాంగానికి ఇవ్వకుండా విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. పట్టిసీమ పేరుతో రాయలసీమ అన్నదాతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నెల క్రితం ముందస్తు వానలతో రైతులు అరుతడి పంటలు వేసుకున్నారని, ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో  అవి ఎండుతున్నా అధికారులు నీటిని ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. కలెక్టర్, జలవనరుల శాఖాధికారులు అమరావతి డైరెక్షన్‌లో నడుస్తూ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  

అదృష్టం వరించినా సీఎం దక్కనీయడం లేదు: మ్మెల్యే గౌరు చరితారెడ్డి
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండి అదృష్టం వరించిందని, అయితే.. ఈ నీరు రైతుల పొలాలకు దక్కకుండా సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా అనంతపురానికి తీసుకెళ్తున్నారన్నారు. కేసీ కెనాల్లో నీళ్లు లేవని, ఎస్‌ఆర్‌బీసీకి 500 క్యూసెక్కులను మాత్రమే వదిలారని, దీంతో ఆరుతడి పంటలు కూడా ఎండిపోతుండడంతో అన్నదాతకు దిక్కుతోచడంలేదని వివరించారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 10 వేల ఎకరాల్లో వేసిన ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని, కేసీ కెనాల్, నిప్పులవాగుకు నీళ్లు వదలాలని కోరుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు