మార్చి 31 నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి

10 Sep, 2017 02:38 IST|Sakshi
మార్చి 31 నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి
అధికారుల సమీక్షలో సీఎం
 
సాక్షి, అమరావతి: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికల్లా ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు గడువు విధించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనుల పురోగతిపై సీఎం శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు. పనులు మందకొ డిగా చేస్తూ నిర్మాణ సంస్థ సోమా ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచి ఇకనుంచీ 24 గంటలూ.. పగలు, రాత్రీ పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు.

పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులకు అంతరాయం కలగకుండా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకుగాను ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్‌ 31 వరకు దాదాపు నాలుగు నెలలపాటు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు. అయితే దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం నడకదారికి అనుమతించాలని సూచించారు. రహదారి మూసివేసినన్ని రోజులూ పాసుల పేరుతో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతివ్వవద్దని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయ్యేవరకు రెండువైపులా శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని కోరారు.
 
కేఈ ప్రధాన కాలువ బంద్‌
కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం నవంబర్‌ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు, అలాగే 2018 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కేఈ ప్రధాన కాలువ ప్రవాహాన్ని నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. అటు దుర్గగుడి సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు