మూసుకుపోయిన రైలు మార్గం

7 Oct, 2017 10:59 IST|Sakshi

పిఠాపురం:   తూర్పు గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల ఆశలపై రైల్వేశాఖ నీళ్లు చల్లింది. ఆర్థికంగా లాభదాయకం కాదన్న నెపంతో కాకినాడ పిఠాపురం రైల్వేలైన్‌ ప్రాజెక్టును అభయన్స్‌ (తాత్కాలిక నిలుపుదల)లో  రైల్వేబోర్డు పక్కన పెట్టేసింది. దీంతో  పిఠాపురం కాకినాడ రైల్వేమార్గం నిర్మాణానికి మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గత మూడు సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించిన రైల్వేశాఖ కాకినాడ పిఠాపురం మధ్యలో 22 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల కలిసొచ్చేది పెద్దగా లేదంటూ తేల్చేసింది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయితే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్‌ దశ మారనుందా అన్న ప్రశ్నకు రైల్వేశాఖ నిర్ణయం లేదనే చెబుతోంది.

50 ఏళ్లుగా ఉద్యమాలు
1959లో తూర్పు గోదావరి జిల్లా కోకనాడ ప్రయాణికుల సంఘం ఏర్పాటు చేసి ఎటువంటి రైల్వే లైన్లు లేకుండా ఉన్న కోస్తా తీరప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్యపరమైన అవసరాలు తీర్చడానికి కాకినాడను మెయిన్‌ లైన్లో కలపాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు,  ఆమరణ నిరాహార దీక్షలు సైతం నిర్వహించగా 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర లభించింది. కోటిపల్లి నర్సాపురం లైను శంకుస్థాపన సమయంలో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా జరగలేదు. దక్షిణ మధ్య రైల్వేలో విజవాడ రైల్వే డివిజన్‌లో 25 శాతం ఆదాయాన్నిస్తున్న కాకినాడ పోర్టు ఉన్న ప్రాంతానికి ఈ రైల్వే లైన్‌ నిర్మాణంతో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందని రెండు దశాబ్దాలుగా నిపుణులు చెబుతుండగా స్థానికులు అనేక ఉద్యమాలు నిర్వహించారు.

పిఠాపురం  మీదుగా మెయిన్‌ రైల్వే లైను ఉన్నప్పటికీ రైల్వే సౌకర్యాలు మాత్రం పూర్తిస్థాయిలో అందడంలేదని ప్రయాణికులు విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోపోగా చివరకు ప్రాజెక్టు పనికిరానిదిగా తేల్చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.  పీఠికాపురంగా ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వందల సంఖ్యలో భక్తులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. పాదగయ క్షేత్రాన్ని పవిత్రమైనదిగా భావించి కాశీ యాత్రికులు తప్పనిసరిగా ఇక్కడికి వస్తారు.

 అన్నవరం, సామర్లకోట తదితర ప్రాంతాల మాదిరిగా పిఠాపురం రైల్వే స్టేషన్‌ను ఈ ప్రాజెక్టు వల్ల అభివృద్ది చెందుతుందనుకున్న స్థానికుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. కాకినాడకు  కేవలం 15 కిలోమీటర్ల దూరంలో  ఉన్న పిఠాపురం రైల్వేస్టేషన్‌ కాకినాడ మెయిన్‌లైను పనులు పూర్తయితే అత్యంత ప్రాధాన్యత గల స్టేషన్‌గా మారడంతోపాటు ముఖ్యమైన రైళ్లు ఆగడానికి అవకాశం ఉంది. స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.

కోస్తాతీరానికి తీరని అన్యాయం
కాకినాడను మెయిన్‌ లైన్‌లో కలపడం లాభదాయకం కాదని రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం కోస్తా తీరప్రాంతానికి రైల్వే సేవలు అందకుండా చేయడంతోపాటు తీరని అన్యాయం చేసినట్లే. పారిశ్రామికంగా వాణిజ్యపరంగా పర్యాటక రంగం అభివృద్ధికి కాకినాడ పిఠాపురం రైల్వేలైను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సుమారు 50 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రయాణికులు ఎన్నో ఉద్యమాలు చేశారు. గత కేంద్ర మంత్రులు యూవీ కృష్టంరాజు, ఎంఎం పళ్లంరాజులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చేవిధంగా తమ వంతు కృషి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు అనేక ఆటంకాలు కలిగిస్తూ... ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించడం దారుణం. ఎటువంటి ఉపయోగం లేని ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలలో చేపడుతున్న రైల్వేబోర్డు ఇక్కడ మాత్రం లాభం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.
 – వైడి. రామారావు. తూర్పుగోదావరి జిల్లా ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు

ఇది స్థానిక నేతల అసమర్ధత
రైల్వే బడ్జెట్‌లో తక్కువగా నిధులు కేటాయించినప్పుడే కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చివరకు ఈ పరిస్ఙితి ఎదురైంది. ఏదో చేశామని చెప్పుకోవడం తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులు వందల కోట్ల రూపాయల్లో ఉంటే మనకు మాత్రం ఈచిన్న ప్రాజెక్టు కూడా అవసరం కాదని తేల్చడం ఈ ప్రాంత అధికార పార్టీ నేతల వైఫల్యమే. అధికార పార్టీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.
– కొండేపూడి శంకర్రావు,
గ్రంథాలయ కమిటీ సభ్యుడు, పిఠాపురం

మరిన్ని వార్తలు