బియ్యం ఎగుమతులకు బ్రేక్

28 Dec, 2013 01:27 IST|Sakshi

మద్దతు ధర ప్రకటించని కేంద్రం  
విదేశాలలో దిగుమతి సుంకాల పెంపు ప్రభావం


తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: విదేశాలకు బియ్యం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్‌కు లేవీ సేకరణ బియ్యానికి మద్దతు ధరను ఇంకా ప్రకటించకపోవడం, ఇక్కడి నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునే ఆఫ్రికా దేశాల్లో బియ్యం దిగుమతులపై కొత్తగా సుంకాలు విధించడం దీనికి ప్రధాన కారణాలు. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే దొడ్డ(లావు, ముతక) బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో మంచి మార్కెట్టే ఉంది. ఈ బియ్యాన్ని అక్కడ పిండి ఆడించి, దానితో తయారుచేసిన జావను పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందేవారికి ఆహారంగా ఇవ్వడం తదితర కారణాల వల్ల మన బియ్యానికి అక్కడ బాగా డిమాండ్ ఉంది. కొండ ప్రాంతాల్లో నివసించే వారు దొడ్డ బియ్యాన్ని ఇష్టపడతారు. ఆ దేశాల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ వచ్చాక, రాష్ట్రంలోని ఎగుమతిదారులు, ఆ దేశాల్లోని దిగుమతిదారుల ప్రతినిధులు రైస్ మిల్లర్లు, వ్యాపారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తారు.

వాటిని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. నూకల శాతం ఆధారంగా బియ్యం ధర నిర్ణయిస్తారు. ఐదు అంతకంటే తక్కువ శాతం నూకలు ఉండే బియ్యానికి మంచి ధర వస్తుంది. ఇటీవల జపాన్ దేశం కూడా ఇక్కడి బియ్యంపై మక్కువ చూపడంతో ఆ దేశానికీ ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టులో ఈ బియ్యం రవాణా సందడి ఒక్కసారిగా తగ్గిపోయింది. దిగుమతులపై ఆఫ్రికా దేశాలలో కొత్తగా వచ్చిన నిబంధనలు దీనికి ప్రధాన కారణం. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంకా లెవీ సేకరణ బియ్యానికి మద్దతు ధరను ప్రకటించలేదు. వాస్తవానికి ఇప్పటికే మద్దతు ధరను ప్రకటించాల్సి ఉన్నా అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేస్తోంది. ఈ ప్రభావం ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియపైనా ఉంది. మిల్లర్ల నుంచి లెవీగా ఎఫ్‌సీఐ స్వీకరించే బియ్యానికి కొత్త మద్దతు ధరరాని కారణంగా గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇచ్చిన ధరలో 90 శాతం సొమ్మును మాత్రమే మిల్లర్లకు ఎఫ్‌సీఐ చెల్లిస్తోంది. ఈ కారణాలతో పాటు ధాన్యం ధరలు మార్కెట్లో ఆకాశంలో ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు.

ధాన్యం ధరలు అదుర్స్

మార్కెట్లో కొత్త ధాన్యం ధరలు మెరిసిపోతున్నాయి. స్వర్ణ రకం 75 కిలోల బస్తా లోడింగ్‌తో రూ. 1,040 ఉండగా, మిల్లులకు చేరాక కిరాయితో కలిపి రూ. 1,065 ఉంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే సోనా ధాన్యం 75 కిలోల బస్తా రూ.1,350 పలుకుతోంది. మిల్లర్లు ఈ ధరలో ధాన్యాన్ని కొని బియ్యం ఆడించి ఎగుమతి చేసే పరిస్థితి లేదు. అంతర్జాతీయ  మార్కెట్లో 1010 రకం బియ్యం ధర ఐదు శాతం నూకలతో క్వింటాలు రూ.2,250 నుంచి రూ. 2,300 మధ్య ఉంది. ధాన్యం ధరలు తగ్గి, బియ్యానికి కొత్త మద్దతు ధర ప్రకటిస్తే, ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాతే మిల్లర్లు బియ్యం ఎగుమతులకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు