రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం

17 Feb, 2020 04:07 IST|Sakshi

స్వచ్ఛీకరణ తర్వాత సమగ్ర రీసర్వే 

ఎప్పటికప్పుడు మ్యుటేషన్లు

ఏటా రెవెన్యూ జమాబందీ

రేపు ప్రయోగాత్మకంగా రీ సర్వేకి శ్రీకారం  

సాక్షి, అమరావతి: భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు.  

లెక్కలేనన్ని మార్పులు చేర్పులు 
తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్‌డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్‌ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో జగన్‌ సర్కారు ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది.  

జగ్గయ్యపేటలో బేస్‌ స్టేషన్, రీసర్వే 18న ప్రారంభం 
రాష్ట్ర వ్యాప్తంగా భూములను సమగ్ర రీసర్వే చేయాలని నిర్ణయించిన జగన్‌ సర్కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్‌ ప్రాజెక్టుకు ఈనెల 18న (మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్‌ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్‌ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభిస్తారు. తదుపరి మండలంలోని 25 గ్రామాల్లోగల 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చే అనుభవాలతో అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను చేపట్టనుంది.  

రైతులపై నయాపైసా భారం లేదు: ఉప ముఖ్యమంత్రి బోస్‌ 
ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీసేవలో రుసుం చెల్లించాలి. అయితే  భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టుకు రూ.2000 కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా కూడా భారం మోపకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు బోస్‌ ‘సాక్షి’కి తెలిపారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు