వైఎస్‌ఆర్‌సీపీ విజయం తథ్యం

16 Feb, 2014 00:17 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీ విజయం తథ్యం

 వైఎస్‌ఆర్‌సీపీ విజయం తథ్యం
 ఆత్మకూరు,
 రాష్ట్రం సమైక్యంగా ఉన్నా విడిపోయినా రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ఆపార్టీ  శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం గడపగడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రాష్ట్ర విభజనపై జరుగుతున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే రీతిలో ఉందన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులే విభజన విషయంలో గందరగోళ పరిస్థితి కల్పించి సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. పార్లమెంట్ సభ్యులుగా కనీసం గౌరవ మర్యాదలు పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కొందరు సభ్యులు ఆందోళన చేయడం జరిగిందన్నారు. కొన్నేళ్లుగా కలిసి మెలిసి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను విడదీడయం సరికాదని సాగునీరు, తాగునీరు, విద్య, ఆర్థిక పరిస్థితులు సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని పదేపదే ప్రజా ప్రతినిధులు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టి ఓట్ల కోసం విభజించడం సరికాదన్నారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు రక్షణ కరువైందని చెప్పారు.  రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని, అలాగే అన్నీ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.   రాష్ట్రంలో ప్రతిచోటా వైఎస్‌ఆర్‌సీపీకి జనం నీరాజనం పలుకుతున్నారని, ప్రజా సంక్షేమాలకు పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని తెలుగుజాతి ఒక్కటేనని నిరూపించేందుకు ఈనెల 17న ఢిల్లీలో పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన క్షణంలోనే తాను రాజీనామా చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని అయితే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి రెండు రోజులు గడిచినా ఇంతవరకూ రాజీనామా చేయకపోవడం చూస్తుంటే ప్రజల్లో ఎవరు మోసగాళ్లో స్పష్టమవుతుందని చెప్పారు.  వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మహబూబ్‌బాషా, జయకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.
 నియోజకవర్గ  అభివృద్ధే   లక్ష్యం
 శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధే  తన లక్ష్యమని వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ  సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12, 15 వార్డులలో శనివారం ఆయన గడపగడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తీవ్ర మంచినీటి ఎద్దడితో పలు గ్రామాలు ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంటలలో ప్రజలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కేవలం హామీలు ఇవ్వడం మినహా ప్రజా సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. ఏడేళ్లుగా వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు పట్టణానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి విఫలమయ్యారని విమర్శించారు.   వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మహబూబ్‌బాషా, వరాల మాలిక్, జయకృష్ణ, నాగూర్, అంజాద్‌అలీ, మోతుల్లా, యుగంధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, తిమ్మయ్యయాదవ్  తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు