కంప్యూటర్ క్లాస్ లేనట్టే!

9 Jul, 2015 00:40 IST|Sakshi

 ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుందాం.. టెక్నాలజీలో ముందుకెళదాం..’ అంటూ ఊదరగొట్టే ప్రభుత్వం, విద్యార్థులకు కంప్యూటర్ విద్యను దూరం చేస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యను అందించే ప్రాజెక్టును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. తమను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడీ నిర్ణయం ఏంటని కంప్యూటర్ కాంట్రాక్ట్ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. బాబొచ్చాక ఉన్న జాబు ఊడుతోందని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు సైతం తీవ్ర నిరాశ చెందుతున్నారు.
 
 చిలకలూరిపేట రూరల్ : ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోన్న కంప్యూటర్ విద్యను అటకెక్కించింది. ఈ విద్యను అందించే ఐసీటీ ప్రాజెక్టును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జిల్లావ్యాప్తంగా 267 ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు. 534 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఈ విద్యను బోధిస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 66,750 మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం 2012-13 విద్యా సంవత్సరంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నేతృత్వంలో లెవల్ 1, 2, 3, 4 గా పుస్తకాలను పంపిణీ చేసింది.

జిల్లాలోని అన్ని ఉన్నత, మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి మూడు క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ఆరవతరగతి నుంచి పదో తరగతి వరకు కంప్యూటర్ విద్యార్థులకు ఎంఎస్ పెయింటింగ్, పవర్ పాయింట్, కంప్యూటర్ ఇవాల్యూషన్, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్, ఎంఎస్ ఎక్సెస్, హెచ్‌టీఎంఎల్, వెబ్ డిజైనింగ్ వంటివి పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. ప్రైవేటు సెంటర్లలో వేలకువేలు ఫీజులు చెల్లించలేని మధ్య, దిగువ తరగతి విద్యార్థులకు ఈ విద్య వరంలాంటిది.

 రిగ్యులరైజ్ చేస్తారనుకుంటే..
 అయితే కంప్యూటర్ విద్యను అందించే ఏజెన్సీలను ఈ నెల ఐదో తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏజెన్సీద్వారా 2002లో కేవలం రూ.1,410 వేతనంతో కాంట్రా క్ట్ ఉపాధ్యాయులు నియమితులయ్యారు. 2008 లో వీరికి వేతనాన్ని రూ.2,410కి పెంచారు. ప్రభుత్వం తమను రిగ్యులరైజ్ చేస్తుందని ఆశతో వీరంతా పని చేస్తున్నారు. ఏజెన్సీ నిర్వహణకు బ్రేక్ వేయడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై చిలకలూరిపేట ఎంఈవో కె.మురళీధరరావును వివరణ కోరగా కొంతకాలం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలచిపోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే మరో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసి దీనిని పునఃప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.  
 
 జీతాలు తక్కువైనా..
 ప్రభుత్వం అందించే నామమాత్రపు వేతనాలతో వేలాదిమంది విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాం. ఉన్న పళంగా ప్రభుత్వం ఏజెన్సీ నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయటం బాధగా ఉంది.
 - చింతలపూడి వీరబ్రహ్మం, కంప్యూటర్ ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, మురికిపూడి, చిలకలూరిపేట మండలం.
 
 ఉన్నది ఊడగొట్టారు...

 సుదీర్ఘకాలం నుంచి విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తారని భావించాం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి.
  - టీవీ నరసింహారావు, కంప్యూటర్ ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, గుమ్మనంపాడు, బొల్లాపల్లి మండలం

>
మరిన్ని వార్తలు