ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన

26 Feb, 2016 01:55 IST|Sakshi
ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన

తెనాలి నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయం వరకూ  ముస్లింల భారీ ర్యాలీ
సీఐపై చర్యకు రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌ను కలిసి విన్నవించిన ముస్లిం పెద్దలు

 
గుంటూరు ఈస్ట్ : తెనాలి త్రీ టౌన్ పోలీస్టేషన్ సీఐ వై.శ్రీనివాసరావుపై చర్య తీసుకోవాలంటూ ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక కమిటీ నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్దసంఖ్యలో తెనాలి నుంచి ర్యాలీ గా రూరల్ ఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. సీఐ శ్రీనివాసరావు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత శనివారం తెనాలికి చెందిన మొగల్ ఖాజా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించిన విషయం విదితమే. ఇందుకు కారణమైన సీఐపై చర్యలు తీసుకోవాలంటూ ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్పీ నారాయణనాయక్ సమావేశ మందిరంలోకి పిలిచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఖుర్దూస్ మాట్లాడుతూ ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప మొగల్‌ఖాజా ఆత్మహత్యకు యత్నించడనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు.  సీఐని సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెట్టి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలని కోరారు. మాజీ ఎమ్యేల్యే మస్తాన్‌వలీ మాట్లాడుతూ మొగల్‌ఖాజా ధైర్యవంతుడని అతను ఆత్మహత్యకు యత్నించాడంటే సీఐ ఎంతగా వేధింపులకు గురిచేశాడో అర్థంచేసుకోవాలన్నారు. 

ముస్లిం వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షుడు మహమద్ కలీం మాట్లాడుతూ సీఐని సస్పెండ్‌చేసి న్యాయవిచారణ చేపట్టాలని చెప్పారు. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్ మాట్లాడుతూ విచారణ జరగక ముందే ఐజీ.. సీఐ తప్పేమీలే దని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్నదని నివేదిక అందగానే ఆ వివరాలు పై అధికారులకు తెలియచేసి వారి అనుమతితో తగు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగేది లేదన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నసీర్‌అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సీఐపై చర్య లు తీసుకుని, ఖాజా కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు.
 
సీఐ శ్రీనివాసరావుని సస్పెండ్ చేస్తూ  ఐజీ ఆదేశాలు
ముస్లిం మైనార్టీ ఐక్య వేదిక కమిటీ నాయకులు ఎస్పీని కలిసిన గంటల వ్యవధిలోనే ఆరోపణలు ఎదుక్కొంటున్న తెనాలి త్రీ టౌన్ సీఐ వై.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఘటనపై విచారణ జరిపిన ఏఎస్పీ రామానాయక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐని సస్పెండ్ చేస్తూ ఐజీ ఎన్.సంజయ్ ఆదేశాలు ఇచ్చారని, రూరల్ ఎస్పీ నారాయణనాయక్ వెల్లడించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను సీఐకు పంపామని తెలిపారు.  

మరిన్ని వార్తలు