మృతదేహంతో ఆందోళన

19 Nov, 2014 23:51 IST|Sakshi
మృతదేహంతో ఆందోళన

 అమలాపురం రూరల్ :రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు అమలాపురంలో 216 జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళన చేశారు. ఎర్రవంతెన వద్ద రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి మూడు గంటలకు పైగా రాస్తారోకోచేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన మోరంపూడి కల్యాణ్(17) భట్నవిల్లి బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు. ఈనెల 17న కళాశాల నుంచి సాయంత్రం తన స్నేహితులు యాళ్ల రాజు, పరమట జయకుమార్‌తో కలిసి రెండు సైకిళ్లపై ఇంటికి వస్తున్నాడు.
 
 అమలాపురం క్షత్రియ కల్యాణ మండపం వద్దకు చేరుకునే సరికి వెనుక నుంచి అదే కళాశాలలో చదువుతున్న ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ సంఘటనలో కల్యాణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కల్యాణ్ మృతదేహంతో అతడి బంధువులు, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు స్థానిక ఎర్రవంతెన వద్ద ఉదయం 10.30 నుంచి ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినా, ప్రమాదానికి కారకులైన వారిని అరెస్టు చేయలేదని, మృతుడి కుటుంబానికి సాయం చేయాలని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఆందోళనకారులు బైఠాయించారు.
 
 అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండా దుర్గారావు, దళిత నాయకులు గెడ్డం సురేష్‌బాబు, ఈతకోట బాలాస్వామి, బొంతు బాలరాజు, కొంకి రాజామణి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు, ఎస్సైలు బి.యాదగిరి, డి.రామారావు, వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రమాదానికి కారణమైన విద్యార్థిని అరెస్టు చేశామని, అతడిపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు. గంటల తరబడి రోడ్డుపై ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించిన వారు.. ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి మరోసారి ఆందోళనకు దిగారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో దళిత నాయకులు, నిందితుల కుటుంబ సభ్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో డీఎస్పీ ఎం.వీరారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా