వైఎస్‌ వివేకానందరెడ్డికి ఘన నివాళి  

16 Mar, 2019 14:34 IST|Sakshi
విజయవాడ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వివేకానందరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నేతలు తలశిల రఘురాం, మల్లాది విష్ణు, శ్రీనివాస్, యలమంచిలి రవి, విజయ్‌ చందర్‌ 

సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య జిల్లా వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సౌమ్యుడు, అజాతశత్రువుగా గుర్తింపు పొందిన ఆయన మరణం వార్తతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిర్ఘాంతపోయారు. ఈ సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నగర వర్కింగ్‌ పెసిడెంట్‌ మల్లాది విష్ణు, అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉండే అవకాశం ఉందని.. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. 


ఘన నివాళులు..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైఎస్‌ వివేకానందరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్‌ వివేకా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే పెడన నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో బందరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి, పెడన నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్‌లు వివేకా చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసి నివాళులు అర్పించారు. 

విజయవాడ సిటీ: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానందరెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, సినీనటుడు విజయచందర్, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్‌ వివేకానందరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, శాసన మండలి సభ్యునిగా, మాజీ మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారన్నారు. ఆయన ప్రజల మనిషిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అడపా శేషు, అశోక్‌ యాదవ్, శ్రీనివాసరెడ్డి, లంకా బాబు, మల్లికార్జున రెడ్డి, పలువురు అనుబంధ విభాగాల అ««ధ్యక్షులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. 


అత్యంత దారుణం
పూర్ణానందంపేట(విజయవాడ పశ్చిమ): వైఎస్సార్‌ సీపీ నాయకుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య దుర్మార్గమైందని వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బోజ్జగాని రామస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాష్ట్రానికి వైఎస్‌ వివేకానందరెడ్డి చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 


 ‘సీబీఐతో విచారణ చేయాలి’
కృష్ణలంక(విజయవాడ తూర్పు): వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌ సీపీ వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికార దాహంతో వివేకనందారెడ్డిని హత్యచేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేదనే సంకేతం ఇచ్చి భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందన్నారు.

 
ఇది టీడీపీ కుట్రే
గన్నవరం: హత్యాలు, అరాచాకాలు సృష్టించి అయినా ఎన్నికల్లో గెలవాలనే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి వైఎస్‌. వివేకానందరెడ్డిని టీడీపీ హతమార్చిందని మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 1989 నుంచి వైఎస్‌ వివేకాతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. అజాత శత్రువు, సున్నిత మనస్తత్వం కలిగిన ఆయన ఎవరూ గురించి చెడుగా మాట్లాడరని చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మంచి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం చూస్తుంటే ఈ రాజకీయాలు ఎక్కడకి పోతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ హత్య వెనుక వాస్తవాలు వెలికితీసేందుకు విచారణను సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు