ఉద్యోగం పోయిందని కండక్టర్ హఠాన్మరణం

8 Jan, 2014 05:38 IST|Sakshi

 - దేవునితండాలో విషాదఛాయలు
 వంగూరు, న్యూస్‌లైన్ : అతనికి నాలుగేళ్ల క్రితమే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చింది.. ఆపై రెండేళ్లకే రెగ్యులర్ అయింది. ఇక జీవితం సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలోనే చిక్కుల్లో పడ్డాడు. చివరకు ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... వంగూరు మండలం రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దేవునితండాకు చెందిన కేతావత్ మినూనాయక్ (32) 1997లో పదో తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే 2009లో ఆర్టీసీ కండక్టరుగా ఎంపికకాగా కల్వకుర్తి డిపోలో ఉద్యోగం చేస్తున్నాడు. 2011 డిసెంబర్‌లో రెగ్యులర్ అయింది. పది రోజులక్రితమే తన చేతికి గాయం కావడంతో డీఎం అనుమతితో సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈయనకు భార్య పేమి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
  ఇటీవల ఈ డిపోలో 26 మంది కండక్టర్లు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాన్ని సంపాదించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 4న వీరిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో అతని పేరుండటంతో ఆందోళనకు గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం అనారోగ్యంతో ఉండటాన్ని తల్లి చోక్లి గమనించి కనీసం డికాషన్ అయినా కాసి పోద్దామని దుకాణానికి వెళ్లి తీసుకొచ్చింది. అంతలోనే ఎవరో ఫోన్ చేయడంతో మాట్లాడి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆమె రోదనలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని చూసేసరికే మృతి చెందాడు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ నాగమ్మ, మాజీ సర్పంచ్ మల్లికార్జున్‌రెడ్డి, సీపీఎం నాయకులు ఆంజనేయులు, బాలస్వామి, శివరాములు పరామర్శించి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ ఘటనకు ఆర్టీసీ అధికారులే కారణమని ఆరోపించారు. ఈ విషయమై కల్వకుర్తి డీఎం హజ్మతుల్లాను వివరణ కోరగా మినూనాయక్ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినందువల్లే తొలగించామన్నారు.
 
 ఆర్టీసి డిపో ఎదుట మృతదేహంతో ధర్నా
 కల్వకుర్తి: రాత్రి మిన్నూనాయక్ మృతదేహంతో స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో డీఎం హజ్మతుల్లా వారితో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా