ఆత్మ విశ్వాసమే ఆయుధంగా...

22 Jul, 2014 01:01 IST|Sakshi
ఆత్మ విశ్వాసమే ఆయుధంగా...

 కష్టాలు కట్టగట్టుకుని వచ్చి దాడి చేశాయి. బాధలు బండెడు బరువును నెత్తిన మోపాయి. విధి మాటిమాటికీ ఆమె జీవితంతో ఆడుకుంది. అయినా ఆమె ఏనాడూ ఆశ కోల్పోలేదు. అధైర్యపడలేదు. కష్టం విసిరిన రాళ్లను విజయానికి పునాదిగా మలుచుకుంది. బాధలు చూపిన ముళ్లబాటలోనే జీవితాన్ని వెతుక్కుంది. విధిని ఎదురించి అమ్మ తోడుతో ముందుకు వెళుతోంది. ఆమె పేరు లలిత. పేరు సౌమ్యంగానే ఉన్నా... ఆమె జీవితం మాత్రం ఆటుపోట్ల మయమే. బలిజిపేట గ్రామానికి చెందిన బొత్స అప్పారావు, హైమావతిల కుమార్తె లలిత. తండ్రి గతంలో రైస్‌మిల్లులో పనిచేసేవారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆయన ఉన్న ఉద్యోగం చేయలేక ఇంటి వద్దే ఉండిపోయారు.
 
 ఇది ఆ కుటుంబానికి మొదటి దెబ్బ. విరిగిన కాలు బాగుపడిన తర్వాత చిన్న పనులు మాత్రమే చేసుకుంటున్నారు. ఆనాటి నుంచి తల్లి హైమావతి చిరు వ్యాపారం చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. లలితకు చిన్నతనంలో 11వ నెలలో జ్వరం వచ్చి పోలియో సోకింది. ఇక అప్పటి నుంచి ఆమె నడవలేదు. మొదటి దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆమెకు తగిలిన రెండో దెబ్బ ఇది. ఎంతో మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. కానీ లలిత ఏనాడూ తన పై తాను విశ్వాసం కోల్పోలేదు. చదువు విషయంలో చాలా పట్టుదలగా ఉండేది. కుటుంబం కష్టా ల కడలిలో ఉన్నప్పటికీ ఆమె అధైర్యపడలేదు. స్థానిక ఉన్నత పాఠశాలలో 2009లో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.
 
 నూజివీడులో ట్రిపుల్ ఐటీ సీటు సాధించింది. కానీ అక్కడ జాయిన్ అ యిన తర్వాత ఆమెకు అనారోగ్యం చేసింది. ఇక్కడ కూడా విధి ఆమెతో ఆడుకుంది. పెద్ద చదువులు చదవనీయకుండా అడ్డుపడింది. దీంతో ఆమె తిరిగి బలిజిపేట వచ్చి పీఎస్‌ఎన్ కళాశాలలో ఇంటర్‌లో జాయిన్ అయింది. పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించింది.  అ నంతరం డైట్ ప్రవేశ పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకుని స్థానికంగా ఉండే శ్రీభారతి డైట్ శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతోంది. తాను నడవలేకపోయినా పది మందికి నడత నేర్పుతానని విశ్వాసంగా చెబుతోందీ యువతి. చదువుకునే సమయంలో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు తల్లి, తోటి విద్యార్థులు సహకరించారు. వారి సహకారంతో మూడు చక్రాల బండిపై వెళ్లి చదువుకుంటున్న లలిత అందరి మన్ననలు పొందుతోంది.
 - బలిజిపేట రూరల్
 

మరిన్ని వార్తలు