వీసీయా..ఐతే ఏంటి?

5 Jun, 2018 12:54 IST|Sakshi

వైస్‌ చాన్సలర్‌ ఆదేశాలనే తొక్కిపెట్టేస్తున్న రిజిస్ట్రార్‌

అగ్రి ఎకనమిక్‌ పరిశోధన సంస్థ

గౌరవ డైరెక్టర్‌గా పుల్లారావు నియామకం

వీసీ ఓకే చేసిన ఫైలు నెలన్నర క్రితమే రిజిస్ట్రార్‌కు

దాన్ని బుట్టదాఖలు చేసిన ఉమామహేశ్వరరావు

ముదురుతున్న వీసీ–రిజిస్ట్రార్‌ విభేదాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిబంధనలను అతిక్రమించి మరీ.. అధికార తెలుగుదేశం పార్టీకి సేవ చేసే విషయంలో ఒక్కటిగా వ్యవహరించే ఏయూ వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్‌ ఉమమాహేశ్వరరావులు.. పాలనాపరమైన విషయాల్లో మాత్రం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. వైస్‌ చాన్సలర్‌ ఉత్తర్వులను, ఆదేశాలను అమలు చేయాల్సిన రిజిస్ట్రార్‌ వాటిని బుట్టదాఖలు చేయడం ఇప్పుడు ఏయూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగాధిపతిగా ఆచార్య డి.పుల్లారావు గత ఏప్రిల్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విభాగానికి అనుబంధంగా  ఆగ్రో ఎకనమిక్స్‌ సెంటర్‌  (వ్యవసాయ ఆర్ధిక పరిశోధన సంస్థ) పనిచేస్తోంది. ఏయూ ప్రాంగణంలోని స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ భవనంలోనే ఉన్న ఈ సంస్థ గౌరవ సంచాలకుడిగా అర్థశాస్త్ర విభాగాధిపతి వ్యవహరించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆ మేరకు సంస్థ గౌరవ డైరెక్టర్‌గా పుల్లారావు బాధ్యతలు చేపట్టేలా ఉత్తర్వులివ్వాల్సిందిగా కోరుతూ వర్సిటీ పరిపాలన విభాగంలోని ఏ–5 సెక్షన్‌ అధికారులు ఫైల్‌ పంపారు. దాన్ని పరిశీలించిన వీసీ నాగేశ్వరరావు ఆ మేరకు ఉత్తర్వులివ్వాల్సిందిగా సూచిస్తూ ఫైల్‌ను రిజిస్ట్రార్‌కు పంపించారు. కానీ రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు ఆ ఫైలును తొక్కిపెట్టేశారు. ఏప్రిల్‌ 20న వీసీ ఉత్తర్వులివ్వగా.. నెలన్నర దాటినా రిజిస్ట్రార్‌ ఆ ఫైలును పట్టించుకోలేదు.

తన వారిని కొనసాగించేందుకే..
వర్గపోరు నేపథ్యంలో ఇందుకు తెర వెనుక చాలా మంత్రాంగమే నడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా గంగాధర్‌ వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్‌ వర్గానికి చెందిన ఈయన ఎప్పటి నుంచో తమ సంస్థకు గౌరవ డైరెక్టర్‌ అవసరం లేదని, అన్నీ తామే చూసుకోగలమని వాదిస్తూ వస్తున్నారు. కానీ వర్సిటీ నిబంధనల మేరకు గౌరవ డైరెక్టర్‌ పోస్టు అనివార్యం కావడంతో ఎప్పటికప్పుడు  నియమిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం రిజిస్ట్రార్‌  పూర్తిగా తన వర్గీయుడికి వత్తాసు పలుకుతూ నిబంధనలను, వీసీ ఆదేశాలను పక్కన పెట్టేశారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్‌ గంగాధర్‌కు చెక్‌ పవర్‌ ఇచ్చేందుకు సైతం రంగం సిద్ధం చేశారు.

వీసీ, రిజిస్ట్రార్ల తీరుపై ఆచార్యుల్లో అసహనం
రిజిస్ట్రార్‌ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా ఏమీ పట్టించుకోని వీసీ వైఖరిపై ఏయూ ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. తన పదవీ బాధ్యతల విషయమై ఆచార్య పుల్లారావు.. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామమోహనరావును కలుసుకున్నారు. వర్సిటీ నిబంధనల మేరకు అర్ధశాస్త్ర విభాగాధిపతే ఆగ్రో ఎకనమిక్‌ సెంటర్‌ సంచాలకుడిగా వ్యవహరిస్తారని ప్రిన్సిపాల్‌ స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకంగా ఎవరి ఆదేశాలు అవసరం లేదని, పదవీ బాధ్యతలు చేపట్టవచ్చునని సూచించారు.  అయితే వైస్‌ చాన్సలర్‌ నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఆయన వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు.  నెలన్నర క్రితమే  ఆచార్య పుల్లారావును ఆగ్రో ఎకనమిక్స్‌ సెంటర్‌ గౌరవ సంచాలకునిగా నియమించాలన్న వీసీ ఆదేశాలు నేటి వరకు అమలవ్వని పరిస్థితిపై రేపోమాపో ఆచార్యులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు