వెంకన్న స్వామీ..నీ కొండకు నీవే రక్ష!

28 May, 2018 08:53 IST|Sakshi
పాదాల మండపం వద్ద నిరసన తెలియజేస్తున్న సన్నిధి గొల్లలు

టీటీడీని చుట్టుముడుతున్న వివాదాలు

డాలర్‌ శేషాద్రి మంత్రాలు చదవడం, ఆశీర్వదించడాన్ని తప్పుపట్టిన టీటీడీ మాజీ సీవీఎస్‌ఓ

బోర్డు నియామకంలో లొసుగులపై టీటీడీ మాజీ ఈఓ ఐవైఆర్‌ ఫైర్‌

అలిపిరి వద్ద సన్నిధి  గొల్లల ఆందోళన

సాక్షి, తిరుపతి: ఏడు కొండలపై వెలసిన శ్రీవెంకటేశ్వరుడే తన ఆస్తులను కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు రగిల్చిన చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. తాజాగా టీటీడీ మాజీ సీవీఎస్‌ఓ రమణకుమార్‌ డాలర్‌ శేషాద్రి గురించి చేసిన వ్యాఖ్యలు  చర్చనీయాంశమయ్యాయి. తిరుపతి పోలీస్‌ అతిథిగృహంలో మాజీ సీవీఎస్‌ఓ రమణకుమార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా మాజీ ఈఓ ఐవైఆర్‌ కృష్ణారావు టీటీడీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు.

తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద సన్నిధి గొల్లలు టీటీడీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఒకేరోజు ఇన్ని పరిణామాలు జరగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని 300 బంగారు డాలర్లు గతంలో కనిపించకుండా పోయిన విషయాన్ని మాజీ సీవీఎస్‌ఓ రమణకుమార్‌ గుర్తుచేశారు. ఆ సమయంలోనే పింక్‌ డైమండ్‌ కూడా పోయిందని రమణ దీక్షితులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లోనే శ్రీవారికి రూ.లక్ష కోట్లు విలువచేసే ఆభరణాలు ఉండేవని మాజీ ఈఓ రమణాచారి వెల్ల డించిన విషయాన్ని తెలియజేశారు. ఇంకా రూ.50వేల కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు కూడా ఉండేవని తన నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు.

ఆ తాళాలు డాలర్‌ శేషాద్రి వద్దే..
వేల కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను భద్రపరచే గది తాళాలు రెండూ అప్పట్లో టీటీడీ డాలర్‌ శేషాద్రి  వద్దే ఉంచిన విషయాన్ని మాజీ సీవీఎస్‌ఓ రమణమూర్తి తప్పుబట్టారు. డాలర్‌ శేషాద్రి అనే వ్యక్తి మొదట్లో టీటీడీలో పారుపత్తేదారుగా ఉద్యోగంలో చేరారు. ఆయన టీటీడీలో మంత్రాలు, ఆశీర్వాదాలు చేసే స్థాయికి ఎదిగిన విషయాన్ని రమణకుమార్‌ ప్రస్తావించారు. పదవీ విరమణ పొందిన డాలర్‌ శేషాద్రి అనే వ్యక్తి మంత్రాలు పఠించడం, ఆశీర్వాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. బంగారు ఆభరణాలు భద్రపరిచే గది తాళాలు రెండూ డాలర్‌ శేషాద్రికి అప్పగించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆ తాళాలు రెండింటిలో ఒకటి డెప్యూటి ఈఓ వద్ద, మరొకటి పేష్కార్‌ వద్ద ఉండాలన్నారు. ఇదిలా ఉంటే డాలర్‌ శేషాద్రి రిటైర్‌ అయినా ఆఫీస్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ పేరుతో టీటీడీలో కొనసాగించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. 1933 నుంచి ఉండాల్సిన రికార్డులు 1952 నుంచే ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కోరినట్లు సీబీఐ దర్యాప్తు జరిగితే ఆయన అవకతవకలే వెలుగు చూస్తాయని రమణకుమార్‌ వెల్ల డించారు. అయితే చివరగా శ్రీవారి ఆలయంలోని ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఇదిలావుంటే టీటీడీ మాజీ ఈఓ ఐవైఆర్‌ కృష్ణారావు టీటీడీ బోర్డు నియామకంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అన్యమతస్తురాలు ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమిం చేందుకు నిర్ణయం తీసుకున్నపుడే టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు.

సన్నిధి గొల్లల ఆందోళన..
టీటీడీ పాలకమండలి తీసుకున్న 65 ఏళ్లకే రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని సన్నిధి గొల్లలు తప్పుబడుతున్నారు. రమణ దీక్షితులను తొలగించినట్లే సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా పరిగణించి రిటైర్‌మెంట్‌ ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించిందని వారు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా ఆదివారం సన్నిధి గొల్లలు, యాదవులు సంప్రదాయ వృత్తుల వేషధారణలో అలిపిరి పాదాల మండపం వద్ద నిరసన తెలియజేశారు. టీటీడీలో కులరాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను టీటీడీలో పనిచేసే కొందరు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. తాము టీటీడీలో ఉద్యోగులం కాదని, శ్రీవారి సేవకులం మాత్రమేనని స్పష్టం చేశారు. సేవకులకు రిటైర్‌మెంట్‌ ఉండదని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు