‘డబుల్‌’ దగా!

22 Jan, 2019 13:22 IST|Sakshi
నిరసన కారులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు

‘పీఎంఏవై– ఎన్‌టీఆర్‌ నగర్‌’లో ఫ్లాట్ల కేటాయింపుపై లబ్ధిదారుల ఆందోళన

430 చ.అ.లకు డిపాజిట్‌ కట్టించుకుని 300 చ.అ. ఫ్లాట్‌ కేటాయించారని ఆరోపణ

వీఎంసీ కమిషనర్‌ చాంబర్‌ ఎదుట మూడు గంటల పాటు ఆందోళన

ఏజేసీ నచ్చజెప్పినా వెనక్కి తగ్గని వైనం

పారదర్శకత.. విశ్వసనీయత.. అందరికీ సమన్యాయం అంటూ ఊదరగొట్టే అధికార పార్టీ నాయకులు ప్రజలను నిలువునా ముంచుతున్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అంటూ విస్త్రృతస్థాయిలో ప్రచారం చేసిన ప్రభుత్వం.. తీరా ఫ్లాట్ల కేటాయింపుల్లో అస్మదీయులకే పెద్దపీట వేసింది. అప్పులు చేసీ మరీ డీడీలు చెల్లించిన లబ్ధిదారులు తమకు ఇచ్చిన ఆన్‌లైన్‌ కేటాయింపు పత్రాలు చూసి అవాక్కయ్యారు. అంతా అవకతవకలుగా ఉండడంతో నష్టపోయామని గ్రహించిన ‘పీఎంఏవై– ఎన్‌టీఆర్‌ నగర్‌’ లబ్ధిదారులు విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని నినదించారు.  

పటమట(విజయవాడ తూర్పు): గూడు లేనివారికి శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం.. నమ్మించి మోసం చేసిందని పీఎంఏవై–ఎన్‌టీఆర్‌ నగర్‌ పథక లబ్ధిదారులు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించటంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అనుచరులు, టీడీపీ వర్గాల వారికి డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్లను కేటాయించి, అర్హులైన లబ్ధిదారులకు సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు.

8,285 మంది లబ్ధిదారులు
ఓటు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు నగరంలోని ఆయా డివిజన్లలో 8,285 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని ప్రకటించటం, కేటాయింపు పత్రాల్లో కనీసం కమిషనర్‌ సంతకం కూడా లేకపోవటంతో సోమవారం వీఎంసీ ప్రధానకార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్‌ ముట్టడికి లబ్ధిదారులు యత్నించారు. ఇళ్లకేటాయింపులో తమకు 430 చదరపు గజాల ఫ్లాట్‌ ఇస్తామన్నారని.. అందుకు లబ్ధిదారుల వాటాగా రూ. 25 వేలు చెల్లించాలని చెప్పిన కార్పొరేషన్‌ అధికారులు, తమ వద్ద నుంచి డీడీలు కూడా తీసుకున్నారని తెలిపారు. తీరా కేటాయింపులు మాత్రం 300 చదరపు అడుగుల ఇళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా టీడీపీ అనుచరులకు ఫ్లాట్ల కేటాయింపులు అధికంగా జరిగాయని, ఆన్‌లైన్‌ ప్రక్రియతో పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయని చెప్పిన అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తమను మోసం చేశారని మండిపడ్డారు.

సాధ్యం కాదు..
ఫ్లాట్‌ నంబర్ల కేటాయింపులో కీలకంగా ఉన్న కమిషనర్‌ తమకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న వీఎంసీ అదనపు కమిషనర్‌(జనరల్‌)డి. చంద్రశేఖర్‌ లబ్ధిదారులతో సంప్రదింపులు జరిపారు. తామందరికీ డబుల్‌బెడ్‌ రూంలు కేటాయించాలని లబ్ధిదారులు పట్టుపట్టారు. అయితే అది సాధ్యం కాదని ఏసీజీ వివరించటంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని సంఘటన వద్దకు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు న్యాయం చేసే వరకు చాంబర్‌ నుంచి కదలమని బైఠాయించటంతో పోలీసు లు రంగప్రవేశంచేసి ఆందోళన కారులను చెదరగొట్టి, అనంతరం వామపక్ష నాయకులను అరెస్ట్‌ చేశారు.

అన్యాయం చేశారు
మా ఇంట్లో ఆరుగురం ఉన్నాం. కేటాయింపుల సమయంలో మా వద్ద రెండు పడకల గదులకు ఇల్లు మంజూరు జరిగిందని అందుకు రూ.25 వేలు చెల్లిచాలని చెప్పటంతో అప్పుచేసి మరీ చెల్లించాం. తీరా ఇప్పుడు చూస్తే 300 అడుగుల ఇంటిని కేటాయించామని పత్రాన్ని చేతిలో పెట్టారు. ఇదేమని అడుతుంటే కావాలంటే తీసుకోండి.. లేదంటే డీడీలు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది.– షేక్‌ మస్తాన్‌బి, లబ్ధిదారురాలు, అజిత్‌సింగ్‌నగర్‌

ఇదేమి చోద్యం
నా భార్య సంకు సామ్రాజ్యం పేరిట మాకు ఫ్లాట్‌ వచ్చింది. దరఖాస్తులో మేము డబుల్‌ బెడ్‌ రూంని ఎంపిక చేసుకున్నాం. కేటాయింపు పత్రం కూడా డబుల్‌బెడ్‌ ఇంటికి మంజూరయ్యిందని అధికారులు చెప్పారు. కానీ ఆన్‌లైన్‌ లాటరీ వ్యవహారంలో సింగిల్‌బెడ్‌ రూం అని పత్రాన్ని చేతిలో పెట్టారు. ఇదేమని అడిగితే కావాలంటే తీసుకోండి.. లేదంటే లేదు అని దురుసుగా సమాధానమిస్తున్నారు.– సంకు కోటేశ్వరరావు, లబ్ధిదారుడు, నాలుగో డివిజన్‌

మరిన్ని వార్తలు