దొంగాట!

12 Nov, 2018 12:57 IST|Sakshi

ఎమ్మెల్యే సీటు కోసం     అమరావతిలో చెట్టాపట్టాల్‌

సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్క వెనుదిరిగిన నేతలు

రహస్య ఒప్పందం తెలిసి ద్వితీయశ్రేణి నేతల ఆగ్రహం

విషయం తెలుసుకున్న ఎంపీ సీఎం రమేష్‌ వర్గీయులు

ఆపై ఓ మాజీ ఎమ్మెల్యేతో దూరంగా ఉంటున్న వైనం

వైఎస్‌ఆర్‌ జిల్లా : టీడీపీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల డ్రామాను గుర్తించిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అందరినీ  నమ్మించిన ఆ ఇద్దరు సీఎంను కలిసేందుకు చెట్టాపట్టాల్‌ వేసుకొని అమరావతి వెళ్లారు. అక్కడి పరిస్థితి గమనించిన కొందరు స్థానిక నేతలకు సమాచారం అందించారు. అప్పటి నుంచి ఓ మాజీ ఎమ్మెల్యేతో ఎంపీ రమేష్‌ వర్గీయులు దూరమయ్యారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఆ ఇద్దరు ‘దొంగాట’ ఎంచుకోగా అదే విషయాన్ని గుర్తించిన నేతలుడైలమాలో పడ్డారు.

ద్వితీయశ్రేణి నేతల ఆగ్రహం...
ఇద్దరు మాజీ నేతలు పదవుల కోసం ఒక్కటయ్యారన్న విషయం తెలుసుకున్న ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు కొట్టుకునే పరిస్థితిలో తెరపైకి కన్పించి, ఎమ్మెల్యే టెకెట్‌ కోసం కలిసి అమరావతికి వెళ్లడాన్ని రెండు వర్గాల కార్యకర్తలు జీర్ణించుకోలేకున్నారు. పార్టీని నమ్ముకుంటామే కానీ, ఇలాంటి నాయకుల వద్ద ఉండమని కొందరు కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడు రమేష్‌  వర్గీయులు ఓ మాజీ ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు. సీఎం ప్రొద్దుటూరుకు వచ్చే రెండు మూడు రోజులు కూడా వీరు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఇంటిలో జరిగే సమావేశాలకు హాజరు కామని తేల్చి చెప్పడంతో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వేదికగా మారింది. ఇదంతా ఎవరిని మోసం చేసేందుకు మాజీలు డ్రామాలు ఆడుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నిర్వహించే ప్రెస్‌మీట్లకు రావాలని  ఓ మాజీ ఎమ్మెల్యే ఎంపీ రమేష్‌ వర్గ కౌన్సిలర్లను ప్రాధేయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఅంశంపై పోలీస్‌ నిఘా వార్గాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. అమరావతిలో వీరిరువురూ కలిసి వెళ్లిన ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పరిశీలించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు