కమిషనర్, మాజీ కార్పొరేటర్‌ మధ్య వివాదం

19 Apr, 2020 11:05 IST|Sakshi
కమిషనర్‌కు సంఘీభావం తెలుపుతున్న ఉద్యోగ నేతలు 

కేసు నమోదు చేసిన పోలీసులు

కమిషనర్‌కు ఉద్యోగ సంఘాల సంఘీభావం  

కాకినాడ: నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌, మాజీ కార్పొరేటర్‌ బసవా చంద్రమౌళి మధ్య చోటు చేసుకున్న సంవాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తన ఇంటి సమీపంలో గబ్బిలాలు తిరుగుతున్నాయంటూ ఫోన్‌ చేసిన మాజీ కార్పొరేటర్‌.. తనను దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించారని కమిషనర్‌ కె.రమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్‌ తనపై దాడి చేశారంటూ మాజీ కార్పొరేటర్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్‌కు చంద్రమౌళి ఫోన్‌ చేశారు. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గబ్బిలాలు తిరుగుతున్నాయని కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్‌ అసహనంతో తనను, తన కుటుంబ సభ్యులను కించపరిచేలా దుర్భాషలాడరని కమిషనర్‌ చెబుతున్నారు.

ఆ తరువాత కూడా రాత్రి పదేపదే చంద్రమౌళి తనకు ఫోన్లు చేశారని కమిషనర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో మాజీ కార్పొరేటర్‌ ఇంటి వద్దకు కమిషనర్‌ రమేష్‌ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. తన ఇంటికి వచ్చిన కమిషనర్, దాడి చేసి కొట్టారంటూ చంద్రమౌళి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఎంఎల్‌సీ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీఎస్‌ఎన్‌ మూర్తి, రాష్ట్ర ఎన్‌జీఓ సంఘ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కమిషనర్‌ రమేష్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైతే మున్సిపల్‌ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్నారని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాజీ కార్పొరేటర్‌ వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రమౌళి మాట్లాడుతూ తన ఇంటికి వచ్చి దాడి చేసి గాయపర్చిన కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జీజీహెచ్‌లో మాజీ కార్పొరేటర్‌ను ద్వారంపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వీరభద్రారెడ్డి, వైఎస్సార్‌ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ పరామర్శించారు.

మరిన్ని వార్తలు