అయోమయంలో డీఎస్సీ అభ్యర్థులు

29 Nov, 2018 13:26 IST|Sakshi

డీఎస్సీ అభ్యర్థుల్లో అలజడి..రోజురోజుకు మారుతున్న షెడ్యూల్‌తో అనుమానాలు...మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు వాయిదాల పర్వం సాగిస్తున్న నేపథ్యంలో అసలు డీఎస్సీ నిర్వహిస్తారా...లేక ఏదైనా సాకు చూపి ఎత్తేస్తారా అనేసందేహాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారు. 


సాక్షి కడప: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసిన నాటి నుంచి నేటి వరకు పరీక్ష విధానంపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుందా...ఆఫ్‌లైన్‌లో ఉంటుందా...అనేది ప్రభుత్వం నిర్ధారించలేదు.    ఆన్‌లైన్‌లోనే ఉంటుందని ముందు ప్రకటించారు. ఈ విధానం వల్ల అభ్యర్థులకు సంబంధించి పేపర్‌ కొందరికి సులువుగా వస్తే, మరికొందరికి కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో అయితే అందరికీ ఒకే విధానంలో పరీక్ష ఉంటుంది.

కష్టమైనా, సులువైనా ఒకేలా పేపర్‌ ఉండడం సబబని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు దీనివల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని...అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.దీంతో  ప్రభుత్వం సందిగ్దంలో పడింది. అయితే పరీక్షల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో  పరీక్షా విధానాన్ని కూడా వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి భారీగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 198 పోస్టులకుగాను 30,246 మంది దరఖాస్తు  చేసుకున్నారు. డీఎస్సీ ప్రకటన విడుదల అనంతరం పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. డిసెంబరు 6వ తేదీ నుంచి 2019 జనవరి 2వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.  సమయం చాలదని....గడువు పెంచాలని అభ్యర్థల నుంచి  వచ్చిన నేపథ్యంలో  షెడ్యూల్‌ను వాయిదా వేసి బుధవారం మళ్లీ ప్రకటించారు. అయితే షెడ్యూల్‌లో మార్పులు, చేర్పుల నేపథ్యంలో డిసెంబరు 19వ తేదీ నుంచి పరీక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

జనవరి 6వ తేదీలోగా పరీక్షల ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల్లో అలజడి వెంటాడుతోంది. మొదట్లో దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా పంపడంలో సర్వర్‌  సమస్యలు వెంటాడాయి.  తర్వాత పరీక్షల ప్రిపరేషన్‌కు గడువు తక్కువ ఉండడంతో ఆందోళనకు గురయ్యారు.. 
భారీగా దరఖాస్తులు: జిల్లాలో డీఎస్సీకి సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చాయి.  చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రాలేదని పలువురు పేర్కొంటున్నారు. కేవలం 198 పోస్టులకుగాను 30 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయంటే ఉపాధ్యాయ పోస్టులకు ఏ మేరకు పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం రోజుకో ప్రకటన జారీ చేస్తుండడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని వార్తలు