కుప్పమా..పలమనేరా..

24 Dec, 2016 02:20 IST|Sakshi
కుప్పమా..పలమనేరా..

రెవెన్యూ కొత్త డివిజన్ల ఏర్పాటుపై సందిగ్ధత
పలమనేరులో గతంలో స్థలం  కేటాయింపు
తాజాగా కుప్పం వైపు మొగ్గు
 ఆందోళనకు సిద్ధమంటున్న పలమనేరు నేతలు


పలమనేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటవుతుందా లేక.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పానికి దక్కేలా చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీకాళహస్తి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు త«థ్యమనే నేపథ్యంలో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. రెండో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది.  భౌగోళికంగా అటు కుప్పం, ఇటు పుంగనూరు నియోజకవర్గాలకు మధ్యలో ఉండే పలమనేరునే డివిజన్‌ చేయాలనే డిమాండ్‌ దీర్ఘకాలంగా ఉంది. పలమనేరులోనే రెవెన్యూ డిజిజన్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వినతులను పంపారు. కొద్దిరోజులుగా కుప్పానికి రెవెన్యూ డివిజన్‌ హోదా మంజూరవుతుందనే సమాచారం పలమనేరులో రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆందోళనలు, నిరసనలకు సైతం వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే  న్యాయవాదులను విధులను బహిష్కరించారు.

పలమనేరు: రాష్ట్ర విభజనకు ముందు పలమనేరు డివిజన్‌ ఏర్పాటు చేయాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ సీసీఎల్‌ఏ, ఆర్థిక శాఖలవద్దకు వెళ్లింది. ఈలోగానే ఎన్నికలు, సమైక్య ఉద్యమాలతో ఈ అంశం పూర్తిగా తెరమరుగైంది. ప్రస్తుతం మదనపల్లి డివిజన్‌ పరిధిలో పీలేరు, మదనపల్లి, తంబళ్ళపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం శాసనసభ నియోజకవర్గాలున్నాయి. పరిపాలనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రెండుగా విభజించాలని పలు ప్రభుత్వాలు భావించాయి. పాతికేళ్లుగా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.

కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పలమనేరు డివిజన్‌ ఏర్పాటుకు సంబంధించిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక అంశాలపై నివేదిక పంపాలని అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి.  ఆర్డీవో కార్యాలయ నిర్మాణం కోసం పలమనేరులో మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని రిజర్వు చేసిపెట్టింది. ఈ నేప«థ్యంలో అధికార టీడీపీ ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. పలమనేరు కాకుండా కుప్పం పేరు రావడమే ప్రస్తుతం వివాదానికి కారణమైంది.

మరిన్ని వార్తలు