అది జేఏసీ సభా..కాంగ్రెస్ వేదికా?

17 Sep, 2013 03:54 IST|Sakshi

విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర కోసం ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరు కార్చడానికి మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు, విశాఖ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ విమర్శించారు. ఈ నెల 21న నాన్‌పొలిటికల్ జేఏసీ విశాఖలో నిర్వహిస్తున్న లక్ష గళార్చన జేఏసీ సభా? లేక కాంగ్రెస్ సభా? అనేది చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ సభకు సమైక్యవాదులెవరూ హాజరు కావద్దని వంశీకృష్ణ కోరారు.

పార్టీ కార్యాలయంలో సోమవారం వారు భీమిలి సమన్వయకర్త కోరాడ రాజబాబు, పార్టీ నాయకులు పక్కి దివాకర్, నౌషాద్, కాళిదాసురెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ పార్టీ అయితే రాష్ట్ర విభజనకు కారణమైందో ఆ పార్టీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును పక్కన పెట్టుకుని, సమైక్య సభకు సీఎంను కూడా ఆహ్వానిస్తామని చెప్పడం ఉద్యమానికి ద్రోహం చేసినట్లేనని వారు విమర్శించారు. మంత్రులు వారి రాజకీయ మనుగడ కోసం జనాన్ని ఈ రూపంలో కూడా మోసం చేస్తున్నారన్నారు.

నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ బాలమోహనదాస్ సమైక్య సభ ఏర్పాట్ల సభకు తమను కూడా పిలిచి ఇది రాజకీయేతర సభ అని చెప్పారని వంశీకృష్ణ తెలిపారు. తీరా ఆయన తీరు చూస్తే కాంగ్రెస్ ఏజెంట్‌గా మారినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. తమను తప్పుదోవ పట్టించిన బాలమోహన్‌దాస్ నాన్ పొలిటికల్ అనే పేరు తీసి దాని స్థానంలో కాంగ్రెస్ జేఏసీ అని పెట్టుకోవాలన్నారు. మంత్రి గంటాతో ఆయన కుమ్మక్కయ్యారనీ, అందువల్ల 21వ తేదీ జరిగే సభకు సమైక్యవాదులెవరూ వెళ్లవద్దని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు