పార్టీ వీడకముందే వేటు

2 Aug, 2013 03:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మెదక్ ఎంపీ విజయశాంతి పార్టీని వీడే అంకానికి అధినేత సస్పెన్షన్‌తో ముగింపునిచ్చారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి   కేసీఆర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడతున్న క్రమంలోనే విజయశాంతి పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు విజయశాంతి మంతనాలు సాగించిందనే పక్కా సమాచారంతో సస్పెన్షన్ వేటు వేశారు. ‘తల్లి తెలంగాణ’ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి 2009 సాధారణ ఎన్నికలకు ముందు తాను స్థాపించిన సంస్థను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. మెదక్ జిల్లాతో ఏ విధమైన సంబంధం లేకున్నా ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయశాంతి అభ్యర్థిత్వం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. కేసీఆర్ పక్షాన పార్టీ నాయకులు మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
 
 అయితే విజయశాంతి నుంచి వత్తిడి రావడంతో ఉత్కంఠ నడుమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తెలంగాణవాదం, విజయశాంతి సినీ గ్లామర్ కలిసి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అంచనా వేశారు. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్‌పై కేవలం 6 వేలకు పైగా ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లోనూ సిద్దిపేట, మెదక్ మినహా మిగతాచోట్ల టీఆర్‌ఎస్, భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో విజయశాంతిపై కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత చూపారు. హరీష్‌రావుకు పట్టు వున్న సిద్దిపేటలో 65 వేలకు పైగా ఓట్లు సాధించడంతో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలుపు సాధ్యమైంది.
 
 కాంగ్రెస్‌తో సాన్నిహిత్యం
 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆశించిన రీతిలో ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఇదే సమయంలో పలువురు నేతలు పార్టీని వీడగా, విజయశాంతి కూడా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఓ దశలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో దాదాపుగా చేరిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, కేసీఆర్ ఆమరణ దీక్ష పరిణామాల నేపథ్యంలో విజయశాంతి రూటు మార్చి తిరిగి గులాబీ పార్టీ గూటికి చేరుకున్నారు. అయితే పార్టీలోకి తిరిగి వచ్చినా పలు సందర్భాల్లో పార్టీతో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ 2011 అక్టోబర్ 18న జనచైతన్య యాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటించారు. టీఆర్‌ఎస్ నాయకత్వం వారించినా వినకుండా ప్రజ్ఞాపూర్ వద్ద అద్వానీకి ఎదురేగి విజయశాంతి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎంపీ పార్టీతో అంటీముట్టని వైఖరి ప్రదర్శిస్తూ వచ్చారు. పార్టీ శ్రేణులు కూడా ఎంపీతో దూరాన్ని పాటిస్తూ వచ్చారు. విజయశాంతి ఎన్నికల ఏజెంటుగా వ్యవహరించిన టీఆర్‌ఎస్ బహిష్కృత నేత రఘునందన్‌రావు కూడా క్రమంగా దూరమవుతూ వచ్చారు.
 
 పోటీపై స్పష్టత ఇవ్వనందునే..
 వచ్చే సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు విజయశాంతిపై కేడర్‌లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో మరోమారు సీటు ఇచ్చి మోయడమెందుకనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. మరోవైపు తనకు సీటు కేటాయింపు అంశంపై స్పష్టత కోరినప్పటికీ పార్టీ స్పందించకపోవడంతో సొంత మార్గం వెతుకులాటలో భాగంగా విజయశాంతి పార్టీని వీడేందుకు నిర్ణయించారు. నష్ట నివారణ పేరిట సస్సెన్షన్ విధించడంతో విజయశాంతి భవిష్యత్ అడుగులపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు