'తెలంగాణపై నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తప్ప చేసింది'

22 Aug, 2013 15:31 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎవరితో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుని పెద్ద తప్పు చేసిందని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్లో అన్నారు. రాష్ట విభజనపై రెండోఎస్సార్సీ వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫార్సును అమలు చేయాలని ఆయన యూపీఏ సర్కార్కు సూచించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేదే తమ అత్యంత ముఖ్యమైన డిమాండని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీరు నిరంకుశంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని ఆపాలంటే ఏదో ఓ చర్య తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈసందర్భంగా హితవు పలికారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించాకే అందరి ఆమోదంతో తెలంగాణ ఏర్పాటు చేయాలని గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.



రాష్టంలో ప్రాంతాల వారీగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు అభిప్రాయాలు వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరితే... తాను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అఖిల పక్ష సమావేశంలో సూచించానన ఈ సందర్భంగా గాదె వెంకటరెడ్డి  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు