కాంగ్రెస్ పని సరి!

14 Dec, 2013 04:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుంది. స్వార్థ ప్రయోజనాల కోసం అంటిపెట్టుకొని ఉండేవారు తప్ప మిగిలినవారంతా ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు త్వరలోనే వైఎస్‌ఆర్‌సీపీలోకి రానున్నారు. ఈ విషయమై తన అనుచరులు, మద్దతుదారుల అభిప్రాయం తీసుకుని తుది నిర్ణయం ప్రకటిం చనున్నారు. పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా క న్వీనర్ ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు.

ఈ నేపథ్యం లో ఈ నెల 15న అంపోలు వద్ద ఉన్న శారద ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని తోటలో తమ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్‌నాయుడు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీనికి రాజకీయ సమాలోచన సభ అని పేరు పెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరే తేదీని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన 3 వేల మందిని ఆహ్వానించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని ధర్మాన వర్గీయులు భావిస్తున్నారు.
 కాంగ్రెస్‌పై నిప్పులు చెరగనున్న ధర్మాన
 అంపోలు సమావేశంలో చేసే ప్రసంగంలో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరగనున్నారని తెలుస్తోంది. ఒకనాడు సిద్ధాంతాల కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పుడు అధికారం కోసం ఏ విధంగా ఠ  మొదటి పేజీ తరువాయి
 దిగజారుతున్నారనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయనున్నట్లు తెలిసింది. అధికారంలో ఉన్నంతకాలం పార్టీ బలహీన పడటం ప్రజాస్వామ్యంలో సహజమని, అయితే అధికారాన్ని విడిచిపెట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సహా దేనికైనా సిద్ధపడుతోందని, తమకు ప్రత్యర్థులుగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతోనూ జతకట్టేందుకు సైతం వెనుకాడటం లేదనే అంశంపై వివరణాత్మక ప్రసంగం చేసేందుకు ధర్మాన సిద్ధమైనట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్సే సర్వస్వమనుకున్న తనను హైకమాండ్ పెద్దలు ముద్దాయిగా మార్చడం వెనుక కారణాలేమిటనే విషయాన్ని కూడా వివరించనున్నట్లు తెలిసింది.
 ధర్మాన బాటలోనే
 టీడీపీ నేతలు కూడా..
 ధర్మాన ప్రసాదరావు బాటలోనే  నడవాలని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు నిర్ణయించుకున్నటు ్టసమాచారం. ధర్మాన చేరిన రోజున అదే వేదికపై వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు వీరంతా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టీడీపీలో ఇప్పటికే రెండు వర్గాలు ఉన్నాయి. కిమిడి కళావెంకట్రావు వర్గం ఒకటి కాగా, కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్గం మరొకటి. ఈ రెండు వర్గాలను పక్కన బెట్టాలనుకుంటున్న వారు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేకమంది గ్రామ సర్పంచ్‌లు వైఎస్‌ఆర్‌సీపీలో చేరగా మరి కొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
 డీసీసీపై పట్టుకు వర్గ పోరాటం
 ధర్మాన ప్రసాదరావు వైఎస్‌ఆర్ సీపీలో చేరాలనే నిర్ణయానికి రావడంతో జిల్లా కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీ మోహన్‌లు వర్గ పోరుకు సిద్ధమయ్యారు. తొలుత డీసీసీ కార్యాలయం ఇందిర విజ్ఞాన్ భవన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డీసీసీ కార్యాలయంలో ధర్మానకు ప్రత్యేక గది ఉంది. ఈ గదిలోని సీట్లో ఆయన తప్ప మరెవరూ కూర్చోరు. కృపారాణి సాహసించకపోయినా కోండ్రు మురళీ మాత్రం ఇటీవల ధర్మాన కూర్చునే సీట్లో ఆసీనులయ్యారు. తద్వారా పార్టీలో పరిస్థితి మారిందనే సంకేతాలను మురళి పార్టీ శ్రేణులకు ఇచ్చారు. దీంతో ధర్మాన వెళ్లాక పార్టీలో ఉండటం వృథా అని పలువురు నేతలు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఆయనను కాదని కాంగ్రెస్‌లోనే ఉండేవారు ఎవరూ శ్రీకాకుళంలో లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో డీసీసీ కార్యాలయం వెలవెలబోవటం ఖాయమంటున్నారు. చెబుతున్నారు. ధర్మాన సహాయ సహకారాలతో మంత్రులైనవారు రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు.
 వైఎస్‌ఆర్‌సీపీ మరింత బలోపేతం
 ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చారు. ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం బూత్ కమిటీలను చురుకుగా ఏర్పాటు చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు తదితరుల చేరికతో జిల్లాలో తిరుగులేని శక్తిగా వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భవించటం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీకి.. దివగంత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారు, కొత్త ఓటర్లుగా నమోదైన యువతతో సహా మెజారిటీ ప్రజలు ఓట్లు వేస్తారని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా అన్ని నియోజకవర్గాల్లోను పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు