తుది విడత కాంగ్రెస్‌కు పరీక్షే!

30 Jul, 2013 07:23 IST|Sakshi

ఇప్పటివరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన అధికార కాంగ్రెస్ పార్టీకి తుది విడత ఫలితాలు అసలు పరీక్షగా మారాయి. మూడో విడతలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికలు జరుగుతుండగా అంతటా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య గ్రూపు విభేదాలు తార స్థాయిలో  ఉన్నాయి. పైగా ఓటరు నాడి అందక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ సాధించే ‘స్కోర్’పై ఉత్కంఠ నెలకొంది.
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తుది విడతలో సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 345 సర్పంచ్‌లు, 3,195 వార్డుల్లో ఎన్నికకు రంగం సిద్ధమైంది. తొలి విడత పంచాయతీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకపక్ష విజయాలు సాధించారు. మలి విడతలో కాంగ్రెస్ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పైచేయి సాధించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోలు నియోజకవర్గంలో నాయకత్వ లేమి ఉన్నా గణనీయ ఫలితాలు సాధించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు జిన్నారం మినహా, మిగతా నియోజకవర్గాల్లో ప్రభావం చూపలేకపోయింది. ఒకటి, రెండు విడతల ఫలితాల్లో మొత్తంగా అధికార కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యతలో ఉం ది. మూడో విడతలో పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబా ద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, టీ ఆర్‌ఎస్‌తో పాటు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కూడా పెద్దసంఖ్యలో పోటీలోఉన్నారు. దీంతో తుది విడత ఫలి తాలపై కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఆందోళన కనిపిస్తోంది.
 
 కాంగ్రెస్‌లో గ్రూపుల గోల
 డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అధికార యంత్రాంగం అండతో చెలరేగిన స్థానిక నేతలకు ప్రస్తుతం ఓటర్ల నాడి అంతు పట్టడం లేదు. మరోవైపు సీనియర్ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఫరీదుద్దిన్ తన అనుచరుల కోసం శ్రమిస్తున్నారు. వైఎ స్సార్‌సీపీ మద్దతుదారులు దాదాపు అన్ని పంచాయతీ ల్లోనూ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో తాజా, మాజీ మంత్రుల మధ్య నెలకొన్న వర్గపోరు మైనస్‌గా మారుతుందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిష్టారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ వర్గీయులు ఎవరికి వారుగా పోటీలో నిలిచారు. కొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ చీలిక వర్గం వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, టీడీపీకి మద్దతు పలుకుతోంది. విప్ జయప్రకాశ్‌రెడ్డికి సంగారెడ్డి నియోజకవర్గంలో సొంత పార్టీ పోరు లేనప్పటికీ ‘తెలంగాణ’ అంశం పరీక్షగా నిలవనుంది. కొండాపూర్ మండలంలో వైఎస్సార్‌సీపీ గట్టి సవాలు విసురుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ చేసిన ప్రచార ప్రభావంపై చర్చ జరుగుతోంది. పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో జరిగిన రెండో విడత ఎన్నిక ఫ లితాలతో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే నందీశ్వర్ వర్గీయులు ఎవరికి వారుగా తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు