కాంగ్రెస్ ఖేల్ ఖతమ్

23 Dec, 2013 02:50 IST|Sakshi
కాంగ్రెస్ ఖేల్ ఖతమ్

=టీడీపీ ప్రధాన ప్రత్యర్థి జగనే
 =ఈసారి టీడీపీ ఓడితే అధికారం శాశ్వతంగా దూరం
 =టీడీపీ సమావేశంలో ఎంపీ శివప్రసాద్
 =29న తిరుపతిలో బాబు సభ : జంగాలపల్లె

 
చిత్తూరు (సిటీ), న్యూస్‌లైన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్ తెలిపారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రత్యేక సమావేశం ఆదివారం జరిగింది. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ర్టం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీకి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డే ప్రధాన ప్రత్యర్థి అన్నారు. జగన్‌కు ఈ సారి జరిగే ఎన్నికలు మొదటివని, ఆయన గెలిచినా, ఓడినా పోయేదేమీ లేదని అన్నారు. అయితే టీడీపీ ఓడితే  అధికారానికి శాశ్వతంగా దూరమైనట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజనపై చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పడం అర్థరహితమన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు సమైక్యవాదం వినిపిస్తున్నామంటే, అది చంద్రబాబు ఆదేశాలతో మాత్రమేనని తెలుసుకోవాలన్నారు. అనంతరం టీడీఎల్‌పీ ఉపనాయకుడు, నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడారు. జిల్లాలో పార్టీకి సంబంధించి వెయ్యి మందికిపైగా కార్యవర్గ సభ్యులున్నా సమావేశానికి హాజరుకాకపోవడం దారుణమన్నారు. పదవులను విజిటింగ్ కార్డులపై ముద్రించుకుంటే సరిపోదని మండిపడ్డారు.

రాష్ట్రాల విభజనలో పాత సంప్రదాయాలనే ఆంధ్రప్రదేశ్‌కూ వర్తింపజేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో విభజన బిల్లుపై చర్చను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 29న తిరుపతిలో జరిగే చంద్రబాబునాయుడు బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, గాంధీ, లలితకుమారి, నేతలు రాజసింహులు, శ్రీధర్‌వర్మ, వై.వి.రాజేశ్వరి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు