'అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు'

22 Jul, 2017 12:03 IST|Sakshi
'అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు'
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ మండిపడ్డారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అవినీతి తప్ప.. అభివ​ద్ధి లేదని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు. తుళ్లూరు శపించబడ్డ ప్రాంతమని.. అక్కడ ఎవరు అడుగు పెట్టినా పతనమే అని వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ఊదరకొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారన్నారు. తన ఇంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
 
పోలవరం పేరు చెప్పి తండ్రీ కొడుకులు కోట్లు సంపాదిస్తున్నారన్నారు. చెప్పులు లేకుండా తిరిగిన చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నంద్యాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించుకుంటానంటున్న ముద్రగడ యాత్ర పై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికి ఉందని.. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు టీడీపీ నాయకుడిలాగా మాట్లాడుతున్నారన్నారు. బెదిరించే వైఖరీలో మాట్లాడటం తప్పని అ‍న్నారు. 
మరిన్ని వార్తలు