సీఎం, పీసీసీ చీఫ్‌ల రోడ్‌మ్యాప్‌ల లీక్‌లపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

17 Jul, 2013 01:39 IST|Sakshi
సీఎం, పీసీసీ చీఫ్‌ల రోడ్‌మ్యాప్‌ల లీక్‌లపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం కోరిన రోడ్‌మ్యాపులేమిటి? వాటిపై రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ నాయకులు పార్టీ పెద్దల ముందు పెట్టిన నివేదికల్లో ఏముంది? ఇప్పుడు ఆ ముగ్గురు నేతలు ఎవరికి వారు బయటకు పంపిస్తున్న లీకులు సరైనవేనా? పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాల్సిన ఆ ముగ్గురు ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఒకవేళ అధిష్టానమే ఆ విధంగా సంకేతాలు పంపిందా? అధిష్టానం ఆదేశాల మేరకు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారా? కాంగ్రెస్‌లో ఇప్పుడు సర్వత్రా దీనిపైనే రగడ మొదలైంది. ఈ నెల 12న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు విడివిడిగా తమ రోడ్‌మ్యాప్‌లను అందించారు. అయితే వారు సమర్పించిన నివేదికల్లో ఏ అంశాలున్నాయన్న వివరాలేవీ అధికారికంగా వెల్లడించలేదు. పైగా తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో చర్చించి నిర్ణయిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత గత 4 రోజులుగా వస్తున్న వివిధ కథనాల్లో.. రాష్ట్ర నేతలు సమర్పించిన రోడ్‌మ్యాప్‌లోని అంశాలంటూ బహిర్గతం కావటంపై ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
 
 విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి...
 
 అన్నదమ్ముల్లా విడిపోదామని కొందరు, కలిసుందామని కొందరు నేతలు వాదిస్తున్న తరుణంలో ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ముఖ్య నాయకుల చర్యలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్న నేతలు ఈ వ్యవహారంలో పార్టీ ప్రయోజనాలకన్నా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని పలువురు నేతలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసి లాభం లేదని, ఎందుకంటే కోర్ కమిటీ ముందు రహస్యంగా రోడ్‌మ్యాప్‌లు అందించాలని అధిష్టానం ఆదేశించిన తర్వాత కూడా ఈ రకంగా లీకుల పేరుతో ప్రచారం జరుగుతుంటే ఢిల్లీ పెద్దలపైన  కూడా అనుమానాలు కలుగుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు లేకుండా ఈ నేతలు రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల మధ్య మరింత చిచ్చుపెట్టే విధంగా లేదా తామే హీరోలమని చెప్పుకునే విధంగా ఎందుకు ప్రయత్నాలు చేస్తారని వారంటున్నారు.
 
 హీరోలైపోదామన్నట్లు ప్రవర్తిస్తున్నారు...
 
 రాష్ట్ర విభజనపై అధిష్టానం పెద్దల మనోగతమేమిటో అర్థంకాక ఒకవైపు సతమతమవుతున్న పార్టీ నాయకులకు రోడ్‌మ్యాప్‌ల్లోని కొన్ని భాగాలను లీకులిస్తూ జరుగుతున్న ప్రచారం సంకట స్థితికి నెట్టింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి? వాటిని ఎదుర్కోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? అలాగే రాష్ట్రాన్ని ఎప్పటిలాగే సమైక్యంగా ఉంచితే ఎదురయ్యే పరిణామాలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అనేవి వివరిస్తూ రాజకీయ కోణంలో రోడ్‌మ్యాప్‌లను సిద్ధం చేయాలని అధిష్టానం తరఫున పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటనలో చాలా స్పష్టంగా చెప్పారని.. అలాంటప్పుడు ఇరువైపుల నుంచి సాధ్యాసాధ్యాలు, వాటి పరిణామాలను నేతలు తమ రోడ్‌మ్యాప్‌ల్లో అందజేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ నేత వివరించారు. అయితే అందుకు భిన్నంగా ఈ ముగ్గురు నేతలు తమకు తోచిన విషయాలను లీకు చేస్తూ తమ ప్రాంతంలో తామేదో హీరోలైపోదామన్నట్లు ప్రవర్తిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆ నేత మండిపడ్డారు.
 
 భావోద్వేగాలకు గురయ్యే ప్రమాదం...
 
 తాజాగా తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం నివేదికలోని అంశంగా వచ్చిన లీకులతో తమ ప్రాంత ప్రజలు భావోద్వేగాలకు గురయ్యే ప్రమాదముందని, దీనివల్ల మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో తమ ఉనికి దెబ్బతినకుండా ఉండేందుకు లీకుల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. పీసీసీ చీఫ్ తీరు కూడా చిత్రంగా ఉందని చెప్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చానని ఆ ప్రాంత నేతలు కలిసినప్పుడు చెప్తూ.. మరో ప్రాంతానికి చెందిన నేతలు కలిసినప్పుడు అందుకు భిన్నంగా చెప్తున్నారని సీమాంధ్ర నేతలు ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్ర నేతలు సైతం సీఎం, పీసీసీ చీఫ్ వైఖరి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే కావాలనే లీకులిస్తున్నారే తప్ప మొత్తం నివేదికలో ఏముందో మాత్రం బయటపెట్టకుండా గందరగోళం సృష్టిస్తున్నారని చెప్తున్నారు.
 
 తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భయం...
 
 రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం సమస్య తీవ్రమవుతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజిస్తే అనర్థాలు వస్తాయని, తప్పనిసరైతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పేరుతో మీడియాకు లీకులు ఇవ్వటం వెనుక అసలు మతలబు ఏమిటనే విషయం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. వీరిద్దరు రూపొందించిన నివేదికల్లో అసలు వాస్తవమేమిటనే దానిపైనా ఆయా నేతలు ఆరా తీస్తున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌కు సన్నిహితులుగా ఉన్న నాయకులు చెప్తున్న వివరాల ప్రకారం.. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో పాటు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఇటు సీఎం, అటు పీసీసీ చీఫ్ బొత్స తమ తమ నివేదికల్లో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకవేళ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే ఆ దిశగానే  పార్టీ నేతలను సమాయత్తం చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం.
 
 అయితే విభజిస్తే ఏర్పడే పరిణామాలను కూడా తమ నివేదికల్లో, రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా ఆయా నివేదికల్లో పొందుపర్చినట్లు తెలిసింది. అయితే డిప్యూటీ సీఎం ఇచ్చిన నివేదిక మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నివేదిక రూపకల్పనకు ముందే తెలంగాణ మంత్రులు, జేఏసీ నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలతో దామోదర సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మరోవైపు సీఎం కూడా ఇరు ప్రాంతాలకు చెందిన మంత్రులతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. బొత్స కూడా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలను కలిశారు. ఒక దశలో డిప్యూటీ సీఎంతో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. అయితే సీఎం, పీసీసీ చీఫ్‌లు తమ నివేదికల్లో ఏ ఏ అంశాలను పొందుపరుస్తున్నామన్న విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయితే.. తెలంగాణలో డిప్యూటీ సీఎం ఇమేజ్ పెరుగుతుందని, అదే సమయంలో సీమాంధ్రలో తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో.. సీఎం, పీసీసీ చీఫ్‌లు కోర్ కమిటీ సమావేశం అనంతరం లీకుల వ్యవహారాలు నడుపుతున్నారని మాజీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. మొత్తంమీద రాష్ట్రం నుంచి రోడ్‌మ్యాప్‌లు అందించిన నేతలు తమ ఇమేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప పార్టీని పట్టించుకోవటం లేదని, ఈ రకంగా వ్యవహరిస్తే తెలంగాణలో 15 సీట్లు తెస్తామన్నవాళ్లూ, సమైక్యంగా ఉంచితే 24 సీట్లు తెస్తామన్న నేతలు.. అందరికీ ప్రజల నుంచి షాక్ తప్పదని మరో సీనియర్ నేత విశ్లేషించారు.
 
 
లీకు వీరులు దుర్మార్గులు వారి కథనాల వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు: మధుయాష్కీ
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సలైట్లు పెరిగిపోతారని, ప్యాకేజీయే ఇస్తారని అంటూ కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలతో తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆవేదన్య వ్యక్తంచేశారు. అలాంటి కథనాల కారణంగానే సోమవారం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కోర్‌కమిటీ సమావేశంలో పార్టీ అధిష్టానంతో చెప్పిన అంశాలను లీకుల రూపంలో ప్రచారం చేసుకునే వారు దుర్మార్గులని వ్యాఖ్యానించారు. మంగళవారం మధుయాష్కీ అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న ఈ తరుణంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే.. పది జిల్లాల తెలంగాణనా, ఇంకో రెండు జిల్లాలు కలుపుతారా? అన్నదానిపై అన్నీ ఆలోచించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయం ఏమీ లేకుండానే ఇదంతా జరుగుతోందన్న అక్కసుతోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
 

>
మరిన్ని వార్తలు