అంతా.. నా ఇష్టం!

13 Apr, 2014 04:06 IST|Sakshi
అంతా.. నా ఇష్టం!

 చీరాల, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనానంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోగా.. అభిమానంతో కొనసాగుతున్న కొద్దిమంది కూడా నేతల చర్యలతో పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

కేంద్రమంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి తీరుతో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను తాను ఎంపిక చేసిన వారికే ఖరారు చేయాలని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరింది.ఈ క్రమంలో పార్లమెంట్ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె,  చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రతిపాదనను ఆమె పీసీసీకి, పార్టీ అధిష్టానానికి నివే దించింది. ముఖ్య నాయకులతో సైతం చర్చించకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకుని పార్టీకి ఎటువంటి సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ఎలా ప్రకటిస్తారని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.

చీరాలకు సంబంధించి పార్టీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే విభే దాలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి జేడీ శీలం ఏర్పాటు చేసిన సమావేశంలో చీరాలకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదిగాని గురునాథం, మరికొందరు నాయకులు పనబాక తీరును బాహాటంగా విమర్శించారు.
 
పార్టీకి సంబంధంలేని వారి నుంచి డబ్బులు తీసుకుని టిక్కెట్లపై హామీ ఇస్తున్నారని ఆరోపించడంతో పాటు ఘర్షణకు కూడా దిగారు. చీరాలకు మెండు నిషాంత్, అద్దంకికి డాక్టర్ గాలం లక్ష్మి, పర్చూరుకు మోదుగుల కృష్ణారెడ్డి, సంతనూతలపాడుకు వేమా శ్రీనివాసరావు, వై.శశిభూషణ్, ఎన్.తిరుమలరావు, బాపట్లకు చేజర్ల నారాయణరెడ్డి, వేమూరుకు దేవళ్ల భరత్, రేపల్లెకు మోపిదేవి శ్రీనివాసరావు పేర్లను అసెంబ్లీ అభ్యర్థులుగా పనబాక ప్రతిపాదించారు.

చీరాల అభ్యర్థి మెండు నిషాంత్ పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు తనయుడు. ఇప్పటి వరకూ రాజకీయాల్లో ప్రవేశంలేదు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. నిషాంత్‌ను పార్టీ అభ్యర్థిగా పనబాక ప్రతిపాదించ డం ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మాదిగాని గురునాథం, ఏఎంసీ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, అందె కనకలింగేశ్వరరావుతో పాటు మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీ కోసం పనిచేసేవారికే టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒక్క చీరాలలోనే కాకుండా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పార్టీలో ఉన్న అతికొద్ది మందిలో కూడా విభేదాలు తారాస్థాయికి చేరడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది.

మరిన్ని వార్తలు