కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ చర్యలు

25 Sep, 2013 01:24 IST|Sakshi
కోటగుమ్మం, న్యూస్‌లైన్:న్యాయవాదులను దుర్భాషలాడిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో - కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర రక్షణ కోసం తొలినుంచి ఉద్యమిస్తున్న న్యాయవాదులను కించపరుస్తూ, కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడారన్నారు. న్యాయవాదుల జేఏసీ ప్రకటించిన కార్యక్రమాలనే న్యాయవాదులు చేపడుతున్నారని, అవి వ్యక్తిగత కార్యక్రమాలు కావని గ్రహించకుండా దుర్భాషలాడడం, అసభ్య పదజాలంతో ప్రసంగించడం వారి కుసంస్కారమని ఆయన విమర్శించారు.
 
 రాజమండ్రి సిటి ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు తన సమక్షం లోనే అనుచరులు రెచ్చిపోతున్నా నిరోధించకపోవడం శోచనీయమని, పైగా నేనూ లాయర్‌నే అనడం దురదృష్టకరమని అన్నారు. స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా ఇస్తే, ఆ లేఖను విలేకరులకు ఎందుకు చూపించలేదని ఆయన  ఎమ్మెల్యేని ఉద్దేశించి ప్రశ్నించారు. రాజీనామా చేసిన తరువాత కూడా గన్ మెన్‌ను రక్షణ ఎందుకు తీసుకుంటున్నారని, ఎమ్మెల్యేగా సకల సదుపాయాలు ఎందుకు ఉపయోగించుకుంటున్నారో వివరణ ఇవ్వాలని నిలదీశారు.  న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల ముందు తాము ఆందోళన నిర్వహించామని తెలిపారు.
 
 దీనిని మరచి తననే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే రౌతు వితండవాదం చేయడం హాస్యాస్పదమని ముప్పాళ్ళ అన్నారు. నాయకులు రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టిస్తేనే ఆత్మగౌరవ పోరాటం విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులను కించపరుస్తూ దుర్భాషలాడిన వారికి చట్ట ప్రకారం గుణపాఠం చెబుతామని, ఇది న్యాయవాదుల ప్రతిష్టకు సంబంధించిన అంశమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.ఎల్.ఎన్. ప్రసాద్ స్పష్టం చేశారు. కోశాధికారి రమణ మూర్తి, కార్యదర్శి ఎం.ఎ.భాషా, ఎం. ఆంజనేయ బాబు, బి.జె.ఎస్.దివాకర్, రాఘవ రెడ్డి, సిహెచ్ రామారావు చౌదరి, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు