సీన్ రివర్స్

22 Feb, 2014 09:50 IST|Sakshi
సీన్ రివర్స్

   *  పీసీసీ నేత బొత్సకు భంగపాటు
    * పట్టించుకున్న నాయకులే కరువు
    *పురందేశ్వరికీ అదే అనుభవం
   *మర్నాడే ఎదురైన విభజన స్ట్రోక్

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన ప్రభావం కాంగ్రెస్ నేతలకు మర్నాడే తెలిసొచ్చింది. కేంద్ర నిర్ణయంపై జనం నుంచే స్వపక్షీయుల నుంచీ వారికి ఛీత్కారం ఎదురయింది. సీమాంధ్ర కాంగ్రెస్ దయనీయస్థితికి శుక్రవారం నాటి సంఘటనే దర్పణం పట్టింది. శుక్రవారం నగరంలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పురందేశ్వరిలను కలిసేందుకు విశాఖ కాంగ్రెస్ నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. పీసీసీ అధ్యక్షుడు వస్తే కనీసం నలుగురైదుగురు శాసనసభ్యులు వచ్చి కలిసేవారు.

జిల్లా స్థాయి నేతలు సైతం ఆయనను కలసి మాట్లాడాలంటే గంటో, రెండు గంటలో ఎదురుచూడాల్సివచ్చేది. శుక్రవారం సర్య్కూట్ హౌస్‌కు వచ్చిన ఆయన వచ్చిన కొద్దిమందితో కాలక్షేపం చేసి, విలేకరుల సమావేశంలో మాట్లాడి వెళ్లిపోయారు. పార్టీ శానససభ్యులు తలో పార్టీ దారి వెతుక్కోవడంతో ఆయనను కలసేందుకు శాసనసభ్యులెవ్వరూ రాలేదు. పురందేశ్వరిది అదే పరిస్ధితి. నిన్నటి వరకూ ఆమె కేంద్రమంత్రిగా ఉండడంతో పనుల కోసం, పైరవీల కోసం ఆమె ఇళ్ల, కార్యాలయాల వద్ద జనం గంటల తరబడి వేచి ఉండేవారు.

ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పురందేశ్వరి శుక్రవారం విశాఖలోనే ఇంటిలో అందుబాటులో ఉంటారంటూ ఆమె సహాయకులు నేతలు, కార్యర్తలకు ఫోన్‌లు చేసి, ఎస్‌ఎంఎస్‌లు పెట్టినా పెద్దగా స్పందన కనిపించలేదని తెలిసింది. ఇద్దరు మాజీ కార్పోరేటర్ల మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ ఆమె ఇంటివద్ద శుక్రవారం కనిపింలేదు. పురందేశ్వరి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆమెను కలసేందుకు సందేహిస్తోంది. విభజన పరిణామాల తరువాత నేతల మాటలకు  ఎవ్వరూ విలువివ్వకపోవడంతో వీరి వద్దకు పెద్దగా జనం వెళ్లడం లేదు.
 

మరిన్ని వార్తలు