క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్

14 Feb, 2015 03:48 IST|Sakshi
  • రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్
  •  సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ  క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇప్పుడే ధైర్యంగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల విశ్వాసం చూరగొనే కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడు పార్టీకి పూర్వవైభవం ఖాయం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు. విజయవాడలో శుక్రవారం ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రస్థాయి మేధోమథన సదస్సు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యంలో పార్టీ నేతలు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై టీడీపీ, బీజేపీ తదితర పార్టీల అభిప్రాయాన్నే కాంగ్రెస్ సమర్థించినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన టీడీపీ, బీజేపీలు వాటిని గాలికొదిలేశాయని, ఈ విషయాలనేప్రజల్లోకి తీసుకెళ్లి విశ్వాసాన్ని చూరగొనాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలన్నారు.

    ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించి.. స్వార్థంతో మరోపార్టీల్లోకి వెళ్లారనీ, ఇప్పటికీ పార్టీలో ఇమడలేమని అధైర్యపడేవారు ఉంటే వేరే పార్టీల్లో చేరినా బాధపడేది లేదన్నారు. రఘువీరా మాట్లాడుతూ.. మేధోమథన సదస్సులో పార్టీ నేతలందరూ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెలిబుచ్చాలన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు కూడా ప్రసంగించారు.
     
    మొదటి రోజు మేధోమథనంలో 75 మంది

    తొలిరోజు సదస్సుకు వివిధ జిల్లాల నుంచి 75 మంది నేతలు పాల్గొన్నారు. వీరిని 4 గ్రూపులుగా చేసి పలు అంశాలను చర్చించారు. ఈ క్రమంలో ఎన్నికలప్పుడు అనుసరించిన తీరు, పార్టీ నిర్ణయాలు, పర్యవసానం, ప్రజల స్పందన వంటి అంశాలపై  నేతలు కీలక సూచనలు చేశారు.

     చిరు, బొత్స తదితరుల గైర్హాజర్

     పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులైన చిరంజీవి, బొత్స సత్యనారాయణ, టి  సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్, కిశోర్‌చంద్ర దేవ్, సాయిప్రతాప్‌లు సదస్సుకు గైర్హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు