పెదకూరపాడులో కాంగ్రెస్ ఖాళీ

14 Mar, 2014 00:26 IST|Sakshi
పెదకూరపాడులో కాంగ్రెస్ ఖాళీ
 సాక్షి ప్రతినిధి, గుంటూరు :పెదకూరపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య  మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సైతం ఆ పార్టీని వీడి భారీగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అక్కడ ఇప్పటి వరకు తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కనుసన్నల్లో కొనసాగిన రాజకీయాలకు వైఎస్సార్ సీపీ నేతలు బ్రేక్ వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసరావుపేట లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు ఆచరణ సాధ్యమైన హామీలే ఇస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో చేపట్టనున్న కార్యక్రమాలు, ఇస్తున్న హామీలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రజల 
 నిర్ణయాలకు అనుగుణంగా రాజకీయాలు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే ఉంటే కష్టాలు తప్పని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు.
 
 = అమరావతి మండలంలో నెల రోజుల వ్యవధిలో రెండు గ్రామాల్లోని 80 శాతంపైగా ఓటర్లు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ చేరికకు వైఎస్సార్ సీపీ విధానాలు, నాయకులపై విశ్వసనీయత ప్రధాన కారణమైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పక్కాల సూరిబాబుపై వ్యతిరేకతను మరో కారణంగా చెబుతున్నారు.
 = గత నెల 10న అమరావతిలో జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో ముగ్గురు మాజీ సర్పంచ్‌లు, ఒక మాజీ ఎంపీటీసీ, మరో గ్రామ సర్పంచ్‌తోపాటు యండ్రాయి గ్రామంలోని 80 శాతానికి ఓటర్లు వైఎస్సార్ సీపీలో చేరారు.
 
 = ఆ తరువాత వారం రోజులకు నేమల్లి గ్రామంలోని ఎక్కువ మంది ఓటర్లు వైఎస్సార్ సీపీలో చేరారు. వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం.= పెదకూరపాడు మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు వారి అనుచరులతో గురువారం ఆళ్ల అమోధ్యరామిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లంకొండ రామగోపాలరావు, మాజీ ఎంపీపీ యావర్తి శేషారత్నం,  సొసైటీ మాజీ అధ్యక్షుడు బద్దాల భద్రాచలం వారి అనుచరులు ఉన్నారు.కన్నా రహస్య సమావేశం ...పెదకూరపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి కన్నాకు సమాచారం ఉండటంతో బుధవారం రాత్రి కొందరు ముఖ్యనాయకులను గుంటూరు పిలిపించుకుని చర్చలు జరిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పక్కాల సూరిబాబు తమ సామాజికవర్గం (కమ్మ) పట్ల అనుచితంగా వ్యవహరించారని, మూడు సంవత్సరాల నుంచి తమకు అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని వివరించినట్టు తెలిసింది.
 
 పంచాయతీ ఎన్నికలకు ముందు ఓట్లకోసం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోయినా అభివృద్ధి పూర్తి చేయించారని, ఇప్పటి వరకు చెల్లింపులు జరగక అప్పులు పాలయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అతడి వల్ల తాము నష్టపోతున్నామని, అతడిని బదిలీ చేయాలని వేడుకున్న ఎవరూ పట్టించుకోలేదని కన్నాకు వివరించినట్టు తెలిసింది. ఇతర గ్రామాలకు చెందిన నేతలు తమ గ్రామాలకు వచ్చి పెత్తనం చెలాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇంకా ఈ పార్టీలో అవమానాలు పడలేమని చెప్పినట్టు తెలిసింది. పక్కాలపై లెక్కకు మించి ఆరోపణలు చేయడంతో మాజీ మంత్రి కన్నాకు ఏంచేయాలో పాలు పోక గురువారం మరోసారి సమావేశమైనా వారి నుంచి సరైన హామీ లభించలేదు. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదాలను పరిష్కరించి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కన్నా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో వారిలో ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. 
 
మరిన్ని వార్తలు