భువనగిరిలో కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ

14 Jan, 2014 03:51 IST|Sakshi

ఎంపీ కోమటిరెడ్డి, వ్యతిరేక వర్గీయుల పరస్పరం రాళ్లదాడి
 కానిస్టేబుల్ సహా ఏడుగురికి గాయాలు, లాఠీచార్జి
 పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు
 పోలీసుల రక్షణలో దూతను హైదరాబాద్‌కు తరలింపు
 భువనగిరి, న్యూస్‌లైన్:
నల్లగొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ వ ర్గాలు బాహాబాహీకి దిగాయి. ఏఐసీసీ దూత సమక్షంలోనే పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ సహా ఏడుగురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాలు.. వచ్చే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను ఎంపిక నిమిత్తం సోమవారం ఏఐసీసీ దూత సేవక్‌వాఘేను భువనగిరికి వచ్చారు. స్థానిక రహదారి బంగ్లాలో ఆయన నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న నేతలు తమ అనుచరులతో భారీగా తరలివచ్చారు.
 
 ఈ దశలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులతో బయటకు వెళ్తూ గెస్ట్‌హౌస్ ముందు కార్యకర్తలకు అభివాదం చేసి మాట్లాడుతుండగా, ఆయన వ్యతిరేక వర్గీయులు చెప్పులు విసిరారు. ఎంపీ వర్గీయులు ప్రతిగా అదేతరహాలో స్పందించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాటర్‌బాటిళ్లు, రాళ్ల వర్షం కురిసింది. భువనగిరి ఎంపీ కోమటిరెడి ్డకారు అద్దం పగిలింది. ఈ దాడిలో యాదగిరిగుట్ట కానిస్టేబుల్ కల్యాణ్‌తో సహా ఏడుగురు గాయపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు నారాయణరెడ్డి తదితరులు ఇరువర్గాల వారిని సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా, ఏఐసీసీ దూత వాఘేను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు పంపించారు.
 
 దాడిని నిరసిస్తూ ఇరువర్గాల ర్యాలీ
 పరస్పరం జరిగిన దాడులను నిరసిస్తూ ఇరువర్గాలు గాయపడిన కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీలు చేపట్టారు. ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వర్గీయులు రహదారి బంగ్లా నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దామోదర్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలపై దాడికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్యర్యంలో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అలాగే, దీనికి ప్రతిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు   నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు